పూజా హెగ్డేకు బంప‌రాఫ‌ర్

August 06, 2020

పూజా హెగ్డే కెరీర్ ఇప్పుడు మామూలు ఊపులో లేదు. తెలుగులో ఫ్లాపుల‌తో కెరీర్ ఆరంభించిన ఆమె.. కొంచెం లేటుగా ఫామ్ అందుకుంది. ఏడాదిన్న‌ర కింద‌ట అర‌వింద స‌మేత మూవీతో పెద్ద స‌క్సెస్‌ను ఖాతాలో వేసుకున్న ఆమె.. తాజాగా అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో రికార్డ్ బ్రేకింగ్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో తెలుగులో పూజా కెరీర్ పీక్స్‌కు చేరుకుంది. తెలుగులో ఇక ఆమెను ఆపేవాళ్లు లేన‌ట్లే. ప్ర‌భాస్ లాంటి పెద్ద హీరో స‌ర‌స‌న సినిమా చేస్తూనే వేరే స్టార్ల సినిమాల్లోనూ అవ‌కాశాలందుకుంటోంది. ఇలాంటి స‌మ‌యంలోనే పూజాకు బాలీవుడ్లోనూ ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ ద‌క్క‌డం విశేషం. ఆమె బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌తో జోడీ క‌ట్ట‌బోతోంది.
స‌ల్లూ భాయ్ హీరోగా రాబోతున్న క‌భీ ఈద్ క‌భీ దివాలి చిత్రంలో పూజానే హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ విష‌యాన్ని బాలీవుడ్ క్రిటిక్ క‌మ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వెల్ల‌డించాడు. ఇది అధికారిక స‌మాచార‌మేన‌న్నాడు. హౌస్ ఫుల్ సిరీస్ రైట‌ర్, హౌస్ ఫుల్-4 ద‌ర్శ‌కుడు ఫ‌ర్హ‌ద్ సాంజీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. సాజిద్ న‌డియాడ్‌వాలా ఈ సినిమాకు క‌థ అందించ‌డంతో పాటు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పూజాకు ఇప్ప‌టిదాకా బాలీవుడ్లో ఏదీ క‌లిసి రాలేదు. ఆమె ఎంతో ఇష్ట‌ప‌డి, క‌ష్ట‌ప‌డి చేసిన మొహెంజ‌దారో ఏమైందో తెలిసిందే. హౌస్ ఫుల్-4 మీద భారీ ఆశ‌లు పెట్టుకోగా అది కూడా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. ఐతే ఈ సినిమాలో పూజా ప‌నిత‌నం న‌చ్చిన ఫ‌ర్హ‌ద్.. క‌భీ ఈద్ క‌భీ దివాలిలో ఛాన్స్ ఇప్పించిన‌ట్లున్నాడు.