హౌస్ అరెస్టు నుంచి విడుదల, బయటకొచ్చి ఏం చేస్తాడు ? 

August 13, 2020

కరోనాలో కొన్ని చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. 370 ఆర్టికల్ రద్దు చేసి కశ్మీర్ లోయలో కొత్త రాజకీయం తెరలేపిన కేంద్రం... అల్లర్లు జరక్కుండా ఉండేందుకు అక్కడ ప్రముఖ నేతలను అందరినీ అరెస్టు చేసింది. కొంతకాలం తర్వాత చాలామందిని హౌస్ అరెస్టు చేసింది. వారిలో జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు ఉన్నారు. వీరిద్దరు తండ్రీ కొడుకులు. కొద్దిరోజుల క్రితం ఫరూక్ అబ్దుల్లాను విడుదల చేసిన కేంద్రం తాజాగా ఒమర్ అబ్దుల్లాను విడుదల చేసింది. విచిత్రం ఏంటంటే... దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అయిన నేపథ్యంలో ఎవరికి వారు ప్రజలు స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన విడుదల అవడం ఆసక్తికరం. 

దీనిపై నెటిజన్లు సెటైర్ల కూడా వేస్తున్నారు. పాపం ఇపుడు విడుదల చేస్తే... ఆయనకు బయటికొచ్చి ఏం చేసుకుంటారు... ఏం స్ట్రాటజీరా బాబూ అదిరింది అంటున్నారు. కానీ వాస్తవం వేరు. ఆయన నిర్బంధంపై సోదరి సారా పైలట్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇది జరిగి చాలా రోజులు అయ్యింది. సుప్రీంకోర్టు పలుమార్లు దీనిపై విచారణ జరిపింది. చివరకు మొన్నటి మార్చి 18న ఒమర్ అబ్దుల్లాను ఎపుడు విడుదల చేస్తారు అంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు నోటీసు ఇచ్చింది. కేంద్రం తాజాగా వారిని ఒమర్ ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో పోలీసులు ఆయన్ను గృహనిర్బంధం నుంచి బయటకు వదిలిపెట్టినా... ఇపుడు తనంతట తాను గృహ నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితి తెచ్చింది కరోనా. ఇది విధి అంటే!