అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో అప‌శృతి

May 20, 2019

ప్ర‌ముఖ న‌టుడు నాగార్జున కుటుంబానికి చెందిన అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్ లో  అనుకోని అపశృతి చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ లోని అన్న‌పూర్ణ స్టూడియోలో చోటు చేసుకున్న క‌రెంటు షాక్ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందారు. బుధ‌వారం రాత్రి బాగా పొద్దుపోయిన త‌ర్వాత చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఒక్క‌సారి ఉలిక్కిప‌డేలా చేసింది.

కొద్ది నెల‌ల క్రితం అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. తాజాగా అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుకు సంబంధించిన ఒక సినిమా సెట్టింగ్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. సెట్టింగ్ లో ప‌ని చేస్తున్న కాంతారావు అనే కార్మికుడికి షాక్ త‌గిలింద‌ని.. ఆ వెంట‌నే ఆయ‌న కుప్ప‌కూలిన‌ట్లుగా తెలుస్తోంది.
ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ ప‌రిణామానికి తోటి కార్మికులు నిర్ఘాంత‌పోయారు. అప్ప‌టివ‌ర‌కూ త‌మ‌తో క‌లిసి ప‌ని చేస్తున్న కార్మికుడు క‌రెంటు షాక్ కు గురై నిర్జీవంగా మారిపోవ‌టాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. మృత‌దేహంతో అన్న‌పూర్ణ స్టూడియోలో కార్మికులు ఆందోళ‌న చెందారు. మ‌ర‌ణించిన కుటుంబానికి న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని ఆందోళ‌న చేస్తున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.