మాంద్యం ఎఫెక్ట్ లేని ఇండియన్ కంపెనీ

August 07, 2020
CTYPE html>
ఎవరిని కదిలించినా.. మాంద్యం మాట చెప్పటమే. దేశంలో ఏ కంపెనీ పరిస్థితి అంత బాగోలేదని.. కాస్ట్ కటింగ్ అనో.. చేతినిండా ప్రాజెక్టులు లేవని.. మాంద్యం తమను దెబ్బేస్తుందని.. ఇలా చెప్పే మాటలకు భిన్నంగా.. తమకు మాంద్యం లాంటివి తమ దరికి చేరలేదని.. నిజానికి తమ బిజినెస్ మస్తుగా ఉందన్న విషయాన్ని చెబుతూ ఆశ్చర్యానికి గురి చేస్తుందో సంస్థ.
ఇంతకీ ఆ సంస్థ పేరేమిటో తెలుసా? పీవీఆర్ సినిమాస్. ఇటీవల కాలంలో దూసుకొచ్చిన డిజిటల్ ఫ్లాట్ ఫాం పుణ్యమా అని సినిమా వ్యాపారం పూర్తిగా పాడైందని.. థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే రోజులు పోయినట్లుగా చాలామంది చాలానే విశ్లేషణలు చేస్తుంటారు. కానీ.. అదేమీ నిజం కాదని.. తమ బిజినెస్ చాలా బాగుందని సెలవిచ్చారు పీవీఆర్ ఎంటర్ టైన్ మెంట్ దిగ్గజం పీవీఆర్ సినిమాస్ సీఈవో జ్ఞాన్ చందాని.
అంతేకాదు.. దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే సినిమాలు చూస్తే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని తనకు తెలిసిన చిట్కా అంటూ చెప్పుకొచ్చారు. ఆర్థిక మాంద్యం వల్ల తామైతే సంతోషంగా ఉన్నామని.. వ్యాపారం బాగుందని.. సమస్యలైతే ఏమీ లేవని చెప్పారు. అపోహల వల్ల అందరూ భయపడుతున్నారని.. సినీ పరిశ్రమకు మాత్రం అది వరంగా మారిందన్నారు.
ఏదో మాట వరసకు తాను చెప్పటం లేదన్నట్లుగా.. తొలి త్రైమాసికం ఫిగర్స్ ను ఏకరువు పెడుతున్నారు. అందుకు తగ్గట్లే వారి బ్యాలెన్స్ షీట్లు భారీ లాభాల్ని నమోదు చేయటం గమనార్హం. చైనాకు చెందిన వాండా ఫిల్మ్ హోల్డింగ్ కంపెనీతో పోలిస్తే.. పీవీఆర్ 43 రెట్లకు పైగా ఆదాయాన్ని పొందటం గమనార్హం.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. క్రికెట్ వరల్డ్ కప్ సీజన్లోనూ పీవీఆర్ 20 శాతం లాభాలు పొందినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్ జియో.. అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ లాంటి ఫ్లాట్ ఫాంలో సినిమాలుచూస్తూ.. ఇంట్లో నుంచి థియేటర్లలోకి రావటం లేదన్న మాటలో నిజం లేదని.. తమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్దిల్లుతోందని చెబుతున్న మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.