ఏపీలో ఆపరేషన్ ముస్కాన్ జరిగింది.... అంటే ఏంటి?

August 07, 2020

ప్రభుత్వాలు తీసుకునే కొన్ని చర్యలు ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే అవి అరుదైన సందర్భాలే. తాజాగా డీజీపీ సవాంగ్ ఆధ్వర్యంలో ఏపీ నలుమూలల్లో ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. దానిపేరు ఆపరేషన్ ముస్కాన్. ఎందుకీ ఆపరేషన్ చేస్తారో తెలుసా... అనాథ బాలబాలికల కోసం. తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చి కొందరు గమ్యం తెలియని అనాథ జీవితం గడుపుతుంటారు. ఇలాంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పబ్లిక్ ప్లేసుల్లో గుర్తించడానికి పోలీసు బృందాలు, బాలల బాధ్యతా సంస్థలు చేసే ఆపరేషన్ ఇది. 

తాజాగా ఏపీలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ లో 2378 మంది అబ్బాయిులు దొరికారు. అమ్మాయిలు మాత్రం 396 మంది దొరికారు. వీరిందరినీ ప్రభుత్వ బాలబాలికల సంరక్షణ గృహాల్లో ఉంచారు. ఎవరికైతే కుటుంబం ఉండి అడ్రస్ తెలిసి ఉంటుందో వారిని వెంటనే సొంత ఇంటికి పంపుతారు. ఎవరి చిరునామాలు అయినా దొరక్కపోతే... వారిని ప్రభుత్వ సంరక్షణ గృహంలో ఉంచి పెంచుతారు. భవిష్యత్తులో సరైన ఆధారాలతో బంధువులు వస్తే అప్పగిస్తారు. దీని వల్ల ఇంత మంది జీవితాల్లో వెలుగులు నిండాయంటే... ఆనందకరమైన విషయమే. 

ఈ కార్యక్రమం వాస్తవానికి ప్రతి ఏటా జరుగుతుంది. కానీ ఇది పబ్లిక్ కు తెలిసే అవకాశం తక్కువ. సోెషల్ మీడియా కాలం కదా... ఇపుడు ఏదీ దాగదు.