ప్రత్యర్థులు వారే.. పార్టీలే వేరు.. !

July 20, 2019

ఎన్నికల రణ క్షేత్రంలో వింతలు, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. వారు వీరవుతున్నారు.. వీరు వారవుతున్నారు. అ‘జెండా’ మార్చుకున్నారు...! గత ఎన్నికల్లో కసితీరా తిట్టిన పార్టీ కండువానే కప్పుకుని తాజా ఎన్నికల బరిలో నిలిచారు! అప్పుడూ.. ఇప్పుడూ.. ప్రత్యర్థులుగానే ఉన్నారు..! పార్టీలను మాత్రం మార్చేశారు..!!
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నుంచి 2014లో వైసీపీ తరఫున జ్యోతుల నెహ్రూ, టీడీపీ నుంచి జ్యోతుల చిట్టిబాబు పోటీ చేశారు. నెహ్రూ గెలిచి.. టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ నుంచి బరిలో నిలిచారు. ఆయనపై పోటీ చేసిన చిట్టిబాబు వైసీపీలో చేరి బరిలోకి దిగారు! పాత ప్రత్యర్థులే పార్టీలు మారిపోయారు.
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో మరో ఆసక్తికర పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గౌరు చరిత పోటీ చేశారు. ఆమెపై స్వతంత్ర అభ్యర్థిగా కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పోటీ చేశారు. చరిత గెలిచారు. రాంభూపాల్‌ రెండో స్థానంలో నిలిచారు. తర్వాత ఆయన వైసీపీలో చేరి టికెట్‌ సాధించారు. చరిత టీడీపీ నుంచి బరిలోకి దిగారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి అశోక్‌రెడ్డి, టీడీపీ తరఫున అన్నా రాంబాబు తలపడ్డారు. అశోక్‌రెడ్డి గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. దీంతో రాంబాబు వైసీపీలోకి వెళ్లారు. పార్టీలు మారిన వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.
కృష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. అక్కడ వైసీపీ తరఫున జలీల్‌ ఖాన్‌ పోటీ చేశారు. టీడీపీ మద్దతుతో బీజేపీ తరఫున వెలంపల్లి శ్రీనివాసరావు పోటీ చేశారు. తర్వాత జలీల్‌ ఖాన్‌ టీడీపీలో చేరితే వెలంపల్లి వైసీపీలో చేరారు. ఇప్పుడా సీట్లో టీడీపీ నుంచి జలీల్‌ ఖాన్‌ కుమార్తె పోటీ చేస్తుండగా వైసీపీ తరఫున వెలంపల్లి పోటీ చేస్తున్నారు.