ఆ ఒక్క ఫొటో - కేసీఆర్ కి భారీ డ్యామేజ్ చేసింది

August 13, 2020

Photo : Osmania Hospital after Rains, Hyderabad

ఎంత పవరున్నా కొన్నిసార్లు సర్దుకోవాలి. రెండు అడుగులు వెనక్కేయాలి. లేకపోతే ఎంతో కాలం ప్రయత్నించి తెచ్చుకున్న పేరు గంగలో కలుస్తుంది. పాపం కేసీఆర్ పరువు నిజంగా ’గంగ‘లో కలిసింది.

కోవిడ్ విషయంలో హైకోర్టు ఏం చెప్పినా బేఖాతరు చేయకుండా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్ ... తెలంగాణ సచివాలయం విషయంలో మాత్రం కోర్టు అభ్యంతరాలను కొట్టేసిన మరుక్షణం అర్ధరాత్రి హడావుడిగా కూల్చడం మొదలుపెట్టారు. 

మొన్నే కోట్లాది రూపాయలతో అన్ని సదుపాయాలతో ప్రగతి భవన్ కట్టారు. అంతలో మళ్లీ 500 కోట్లతో సచివాలయం ఎలాగైనా కట్టాలని ప్రయత్నించారు. ఎన్నికోట్లతో కట్టినా అందులో ఆయనే శాశ్వతంగా కూర్చోరు. రేపు కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్లూ దానిని అనుభవిస్తారు. అయినా ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఒకసారి ఆలోచించాల్సింది.

ఇంతకుముందు అయితే పరిస్థితులు వేరు. కానీ మొన్నే ఉద్యోగులకు జీతాలు కట్ చేసి డబ్బుల్లేవు అని చెప్పి సచివాలయం కూల్చివేత, కట్టడం హడావుడిగా ప్రారంభించారు కేసీఆర్. ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ ఉంది. ఆస్పత్రుల కొరత ఉంది. వైద్య సిబ్బంది కొరత ఉంది. డాక్టర్ల ధర్నా, పేషెంట్ల గగ్గోలు... ఇన్ని తలనొప్పులు ఉన్నపుడు దానిని గాలికి వదిలేయడం వల్లే ప్రజలకు తీవ్రంగా కోపం తెప్పించింది. పైగా ఈ టైంలో సచివాలయం కట్టడంపై శ్రద్ధ చూపడంతో మరింత మండింది.

ఇక కేసీఆర్ పుండు మీద కారం చల్లినట్లు ఈ విమర్శల నుంచి బయటపడటానికే ఏం చేయాలో అంతుచిక్కని తెలంగాణ సర్కారుకు బుధవారం కురిసిన వానలు ఒక భయంకరమైన విమర్శను తెచ్చిపెట్టాయి. కోవిడ్ రోగులున్న ఉస్మానియా ఆస్పత్రిలో వార్డుల్లో నీళ్లు నిలిచాయి. ఈ ఫొటో దేశ వ్యాప్తంగా వైరల్ అయిపోయింది. కేసీఆర్ సార్ ఇపుడు ఉస్మానియా బిల్డింగ్ కడదామా? సచివాలయం కడదామా? చెప్పండి అంటూ జనం ఒకటే ప్రశ్నిస్తున్నారు.

నిజానికి పడగొట్టే  సెక్రటేరియట్ ను తాత్కాలికంగా కోవిడ్ ఆస్పత్రిగా చేసి ఉంటే కేసీఆర్ కీర్తి అలా చిరస్థాయిగా నిలిచిపోయేది. ఐడియా రాలేదో, వచ్చినా కేర్ చేయలేదో గాని దాని కూల్చివేత మొదలుపెట్టారు. హైకోర్టుతో అది మరోసారి ఆగిపోయింది. ఇపుడు ఆస్పత్రిగా మార్చే సదుపాయం కూడా లేదు. రెంటికి చెడ్డ రేవడిలా మారింది. 

అచ్చం ఇలాంటి ఘటనే బీహార్లో చోటుచేసుకుంది. ఆస్పత్రి ఆవరణలో నీరు నిలిచిపోవడంతో చెత్తను తరలించే రిక్షాలో కుర్చీ వేసుకుని డాక్టర్లు, సిబ్బంది ఆస్పత్రిలో అటూ ఇటుతిరగాల్సిన పరిస్తితి బయటకు వచ్చింది. ఈ రెండు ఫొటోలను ఏఏపీ సోషల్ మీడియా విభాగం ట్వీట్ చేస్తూ... ‘‘ఇండియా ఫైటింగ్ కోవిడ్’’ అని క్యాప్షన్ పెట్టింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇది వైరల్ అయిపోయింది. కేసీఆర్ పరువు నిజంగానే గంగలో కలిసిపోయినట్టయ్యింది.