పద్మారావుకు కరోనా.. ఈటెల చెప్పిందేమిటి.. జరిగిందేమిటి?

August 06, 2020

తెలంగాణ అధికారపక్షానికి కరోనా వరుస షాకులిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్ కారణంగా.. టీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడటం ఇప్పుడు సంచలనంగా మారింది.

తాజాగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు పాజిటివ్ గా తేలింది. లాక్ డౌన్ సమయంలోనూ.. ఆ తర్వాత తన నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతూ.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైరస్ మూలాలు అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. ఆయన్నుజాగ్రత్తగా ఉండాలని పలువురు సన్నిహితులు చెప్పినా.. తనకేం కాదన్న ధీమాను వ్యక్తం చేసినట్లు చెబుతారు.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.. ప్రజల్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉండాలంటూ కసరుకునే ఆయనకు.. పాజిటివ్ కావటంతో ఉలిక్కిపడే పరిస్థితి.

పద్మారావుతో పాటు.. ఆయన కుమార్తె.. ముగ్గురు మనమళ్లు.. మనమరాళ్లకు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు.

కీలకస్థానంలో ఉన్నా..వరుస కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. నిత్యం మనమళ్లతో సమయాన్ని గడిపే అలవాటు పద్మారావుకు ఉందని చెబుతారు.

పాజిటివ్ గా తేలినా.. వీరి కుటుంబంలో అందరూ అసింప్టమాటిక్ గా ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతానికి హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స చేస్తున్నారు.

పద్మారావు మాత్రం ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే... మీరు గమనించారో లేదో లక్షణాలు లేని వారికి టెస్టులు గవర్నమెంట్ చేయడం లేదు, ప్రైవేటు ల్యాబులు కూడా చేయొద్దని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల ఆదేశించారు.

మరి లక్షణాలు లేకుండా డిప్యూటీ స్పీకరుకు ఎందుకు టెస్టులు చేశారు?

ఆయనకు టెస్టులు చేసిన ల్యాబ్ పై, సిబ్బందిపై చర్యలు తీసుకుంటారా? ఇదెక్కడి న్యాయం. సాధారణ ప్రజలు లక్షణాలు లేకుండా టెస్టుల కోసం వస్తే వెనక్కు పంపమని ఆదేశాలిస్తారా? అదే మీకు నచ్చిన వాళ్లకి అయితే లక్షణాలు లేకపోయినా టెస్టులు చేస్తారా మంత్రిగారు?

మరోవైపు సోమవారం ఉదయం రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే.

గతంలో దీని బారిన పడిన ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు డిప్యూటీ స్పీకరు, డిప్యూటీ హోం మంత్రి దీని బారిన పడటం గమనార్హం.  

ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో అత్యధికం టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావటం గమనార్హం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి.. బాజిరెడ్డి.. గణేష్గుప్తాలు వైరస్ బారిన పడగా..కాంగ్రెస్ నేతలు వీహెచ్.. గూడూరు నారాయణ రెడ్డిలు ఉన్నారు.

బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి.. వారి కుటుంబ సభ్యులు కూడా ఉండటం తెలిసిందే.