కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై అతిగా స్పందిస్తూ ఆవేశపడుతున్న పాకిస్తాన్ మరో తప్పటడుగు ముందుకేసినట్లు సమాచారం. ఏకంగా సరిహద్దులకు సమీపంలో యుద్ధ విమానాలను మోహరించినట్లు నిఘా వర్గాల నుంచి వినిపిస్తోంది. లద్దాఖ్ సమీపంలోని ఫార్వర్డ్ బేస్‌లకు పాక్ బలగాలు సైనిక సామగ్రిని పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. స్కర్దు ఎయిర్‌బేస్ వద్ద పాక్ యుద్ధ విమానాలను తీసుకొస్తున్నట్లు సైన్యం గుర్తించింది.
పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన సీ 130 రకం విమానాల్లో భారీ ఎత్తున ఆయుధాలు, ఇతర సామగ్రిని లద్ధాఖ్ సమీపంలోకిని స్కర్ట్ ఎయిర్‌బేస్‌కు తరలించినట్లు మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. అయితే.. నిఘా విషయంలో సాంకేతికంగా పాకిస్తాన్ కంటే ఎంతో ముందున్న భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ చేస్తున్న సన్నాహాలు, కదలికలను మొత్తం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. పాక్ తమ జేఎఫ్-17 యుద్ధ విమానాలను కూడా ఎయిర్‌బేస్‌కు తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉందని తెలుస్తోంది.
స్కర్దు ఎయిర్‌బేస్ లద్ధాఖ్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. సరిహద్దుల్లో పాక్ చేపట్టే సైనిక ఆపరేషన్స్‌కు ఎక్కువగా ఈ బేస్‌నే ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఆ వాయు స్థావరానికి సైనిక పరికరాలను తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కొద్ది నెలల కిందట భారత్ బాలాకోట్ దాడి చేపట్టిన తర్వాత మన గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు దూసుకొచ్చే ప్రయత్నం చేశాయి. అయితే వాటిని భారత వాయుసేన సమర్థంగా తిప్పికొట్టింది. తాజాగా కశ్మీర్ అంశం నేపథ్యంలో పాక్ మరోసారి అలాంటి చర్యకు దిగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. అంతర్జాతీయంగా కశ్మీర్ విషయంలో భారత్‌కు మద్దతు లభించడడం.. పాక్ వెంట ఏ దేశమూ నిలవకపోవడంతో పాకిస్తాన్ ఇప్పటికప్పుడు మనపై దాడికి దిగేటంత సాహసం చేయకపోవచ్చని భావిస్తున్నారు. పీవోకేను భారత్ స్వాధీనం చేసుకుంటుందేమోనన్న భయంతోనే ఆ దేశం డిఫెన్సు ఏర్పాట్లు చేసుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు.