ఛీ.. ఛీ.. పాక్ చీప్ కంప్లెయింట్లు మానుకోదా!

January 26, 2020

అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్ ప‌రువుపై దెబ్బ‌కొట్టాల‌న్న అత్యుత్సాహంతో పాకిస్థాన్ త‌న‌కు తానే న‌వ్వుల‌పాల‌వుతోంది. చీప్ రాజ‌కీయాల‌తో త‌న ప‌రువు తానే తీసుకుంటోంది. ముందూ వెన‌కా ఆలోచించ‌కుండా భార‌త్ పై దుష్ప్ర‌చారం చేస్తూ త‌నకున్న అంతంత‌మాత్రం ప్ర‌తిష్ఠ‌ను బ‌జారుకీడ్చుకుంటోంది. 

పుల్వామా ఉగ్ర దాడి నేప‌థ్యంలో ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు అండ‌గా నిలుస్తున్న పాకిస్థాన్ ను దౌత్య‌ప‌రంగా ఏకాకిని చేయాల‌ని భార‌త్ నిర్ణ‌యించింది. ఆ ప్ర‌ణాళిక‌లో భాగంగా భార‌త విదేశాంగ రాయ‌బారులు చాలా దేశాల ఎదుట‌ పాక్ తీరును ఎండ‌గ‌ట్టారు. ఉగ్ర సంస్థ‌ల‌కు ఆ దేశం ఆశ్ర‌యం క‌ల్పిస్తున్న తీరును వివ‌రించారు. దీంతో పాక్ ఉక్కిరిబిక్కిర‌యింది. భార‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను దెబ్బ‌కొట్టేందుకుగాను తాను కూడా ఏదో ఒక‌టి చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌పంచ దేశాల ముందు మ‌న‌దేశానికి వ్య‌తిరేకంగా ప‌స‌లేని వాద‌న‌లు వినిపించింది. పాక్ ఎంత మొత్తుకున్నా.. ఆ దేశం తీరుపై ముందే అవ‌గాహ‌న క‌లిగి ఉన్న దేశాలేవీ దానికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేదు. 

దీంతో తీవ్ర అస‌హ‌నానికి గురైన పాక్‌.. ముస్లిం దేశాల సంస్థ అయిన ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ ఇస్లామిక్ కోఆప‌రేష‌న్ (ఓఐసీ) స‌ద‌స్సులో భార‌త్ అతిథిగా పాల్గొన‌బోతోంద‌ని తెలిసి అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించింది. భార‌త్ వ‌స్తే తాము రామంటూ తోసి ముస్లిం దేశాల‌కు తెగేసి చెప్పింది. కానీ ఆ దేశాల‌కు పాక్ కు ఊహించ‌ని షాక్ ఇచ్చాయి. భార‌త్ ను అడ్డుకోబోమ‌ని తేల్చిచెప్పాయి. ఇటీవ‌ల అబుధాబిలో జరిగిన ఆ స‌మావేశానికి సుష్మాస్వ‌రాజ్ అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. సుష్మ రాక‌ను అడ్డుకోలేక‌పోయిన పాక్ ఆ స‌ద‌స్సుకు దూర‌మైంది. 

ఇప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ఐసీసీ)లోనూ మ‌రోసారి పాకిస్థాన్ ఇలాగే న‌వ్వుల‌పాల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పుల్వామా ఉగ్ర‌దాడిలో అమ‌రులైన జ‌వాన్ల‌కు నివాళిగా భార‌త క్రికెట‌ర్లు ఆస్ట్రేలియాతో రాంచీలో జ‌రిగిన మూడో వ‌న్డే ఆర్మీ టోపీలు ధ‌రించి బ‌రిలో దిగారు. దీన్ని పాక్ మంత్రి ఫ‌వాద్ చౌద‌రీ త‌ప్పుప‌ట్టారు. క్రికెట్ ను భార‌త్ రాజ‌కీయం చేసింద‌ని ఆరోపించారు. టీమిండియాపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఐసీసీకి ఫిర్యాదు చేయాల‌ని త‌మ దేశ క్రికెట్ బోర్డు పీసీబీని కోరారు. 

రానున్న మ్యాచుల్లోనూ టీమిండియా ఆట‌గాళ్లు అలాంటి టోపీలు ధ‌రిస్తే.. కశ్మీర్‌లో దురాగతాలకు పాల్పడుతున్న భారత్‌కు నిరసనగా త‌మ క్రికెట‌ర్లు నలుపు బ్యాండ్‌లు ధరిస్తారని ఫ‌వాద్‌ హెచ్చ‌రించారు. ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తూ - క‌శ్మీర్ లో అల్ల‌ర్ల‌ను రెచ్చ‌గొడుతూ - స‌రిహ‌ద్దుల్లో ప‌దేప‌దే కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ప‌దే ప‌దే ఉల్లంఘిస్తున్న పాక్ కు జ‌వాన్ల ప్రాణాల విలువ తెలియ‌ద‌ని.. అందుకే పుల్వామా దాడి అమ‌ర జ‌వాన్ల‌కు నివాళిగా భార‌త క్రికెట‌ర్లు టోపీలు ధ‌రించ‌డాన్ని వివాదం చేస్తోంద‌ని విశ్లేష‌కులు మండిప‌డుతున్నారు. ఇలాంటి చీప్ కంప్లెయింట్ తో పాక్ మ‌రోసారి అంత‌ర్జాతీయ స్థాయిలో న‌వ్వుల పాల‌వ్వ‌క త‌ప్ప‌ద‌ని వారు చెబుతున్నారు.