ఇండియాతో మ్యాచ్.. పాకిస్థానోళ్ల యాడ్ చూశారా?

July 08, 2020

ప్రపంచకప్ అనగానే అందరూ ఆసక్తిగా చూసే మ్యాచ్‌ల్లో ఇండియా-పాకిస్థాన్ పోరు ఒకటి. మామూలుగానే దీనికి హైప్ ఎక్కువ అంటే.. దాన్ని మరింత పెంచడానికి బ్రాడ్ కాస్టర్లు ప్రయత్నిస్తుంటారు. గత ప్రపంచకప్ సందర్భంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముంగిట ‘మోకా మోకా’ అంటూ స్టార్ స్పోర్ట్స్ వాళ్లు తయారు చేసిన ఒక యాడ్ సూపర్ పాపులరైంది. ప్రపంచకప్‌లో ఇండియాపై పాకిస్థాన్ గెలిస్తే టపాకాయలు పేలుద్దామని ప్రతిసారీ పాక్ అభిమాని ఆశపడటం.. మ్యాచ్ ఓడాక నిరాశతో వాటిని తీసి అటక మీద పెట్టడం ఆ యాడ్లో చూశాం. అది సూపర్ హిట్టయింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరో యాడ్ వదిలారు. ఐతే దీనికి కౌంటర్‌గా పాకిస్థాన్ బ్రాడ్ కాస్టర్ ఒక యాడ్ తయారు చేయడం విశేషం.
కొన్ని నెలల కిందట యుద్ధ ఖైదీగా దొరికిన భారత నేవీ అధికారి అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ సైన్యం కస్టడీలో ఉన్నపుడు ఒక వీడియో బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. తన వివరాలు అడిగితే ‘ఐయామ్ నాట్ సపోజ్డ్ టు టెల్ దట్’ అని సమాధానం దాటవేశాడతను. టీ ఎలా ఉందంటే మాత్రం చాలా బాగుందన్నాడు. దాన్ని అనుకరిస్తూ క్రికెట్ మ్యాచ్ యాడ్ తయారుచేశాడు. అభినందన్ లాగే మీసం పెట్టుకున్న ఓ వ్యక్తిని.. టాస్ గెలిస్తే ఏం తీసుకుంటారు, తుది జట్టులో ఎవరుంటారు అని అడిగితే.. అతను ‘ఐయామ్ నాట్ సపోజ్డ్ టు టెల్ దట్’ అన్నాడు. టీ గురించి అడిగితే మాత్రం చాలా బాగుందన్నాడు. అతనలాగే కప్పును పట్టుకుపోతుంటే.. ఆ కప్పు వెనక్కి తీసుకున్నట్లు చూపించారు. చివరగా భారత్-పాక్ మ్యాచ్ గురించి ప్రస్తావించి ‘లెట్స్ బ్రింగ్ బ్యాక్ ద కప్ టు పాకిస్థాన్’ అనే స్లోగన్‌తో ఈ యాడ్ ముగించారు. పాకిస్థాన్ వాళ్లకు ఈ యాడ్ ఎలా అనిపిస్తుందో కానీ.. మన జనాలకు మాత్రం ఇది కామెడీగా అనిపిస్తోంది. ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా పాకిస్థాన్ ఒక్కసారి కూడా భారత‌్‌పై గెలవని సంగతి తెలిసిందే.