ట్రెండ్ మార్చిన గోదావరి పందెం కోళ్లు !!

August 03, 2020

సంక్రాంతి పండుగ అంటే పందెకోళ్లే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా చెప్పుకోవాలి. ఇక పందెరాయుళ్ల హ‌డావుడి మాములుగా ఉండ‌దు. సంక్రాంతి కోళ్ల పందేల‌కు తెలుగు సంస్కృతికి ఉన్న లింక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పండుగ‌కు 10 రోజుల ముందు నుంచే కోళ్ల పందాలు జోరుగా సాగుతుంటాయి. ప్ర‌తీ ఏడు లాగే ఈ సంవ‌త్స‌రం కోళ్ల పందానికి ఆంధ్రాప్ర‌జ‌ల‌తో పాటు వీటిపై ఆస‌క్తి ఉన్న ఇత‌ర రాష్ట్రాల వారు ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చేరుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. కోడిపందాల్లో పాల్గొనేందుకు ముందు పెద్ద క‌స‌ర‌త్తే చేస్తున్నారు.
పందె రాయుళ్ల ఆస‌క్తిని కొంత‌మంది క్యాష్ చేసుకునే ప‌నిలో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆన్‌లైన్లో పందెం కోళ్ల‌ను విక్ర‌యిస్తూ మార్కెట్‌ను గ్లోబ‌లైజేష‌న్ చేసేస్తున్నారు. దీంతో మంచి రేటు వ‌స్తోంద‌ని సంబుర‌ప‌డుతున్నార‌ట‌. ముఖ్యంగా వీటిని OLX, ఫేస్‌బుక్‌లో ఫోటోలు పోస్ట్ చేసి తమ ఫోన్‌ నెంబర్ల ద్వారా బేరసారాలు సాగిస్తున్నారు. యజమానులు తమ ఇంటి వద్ద నుంచే పందెంకోళ్ల ఫోటోలు, ధరలను తెలుపుతూ.. అంతర్జాలంలో విక్ర‌యాలు చేస్తున్నార‌ట‌. ముఖ్యంగా  ఏలూరు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో  కోళ్ల పెంపకందారులు ఈ స్టైల్‌లో అమ్మకాలు చేపడుతున్నారు. ఇక  కొనుగోలు దారుల్లో ఏపీతో పాటు కేరళ, కర్నాటక, గోవాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటుండ‌టం గ‌మ‌నార్హం.  
ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి సంక్రాంతికి పెద్ద ఎత్తున ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌కు వెళ్లి అక్క‌డ తెలిసిన వారిళ్ల‌లో ఆతిథ్యం స్వీక‌రించ‌డం కొన్నేళ్లుగా సాగుతోంది. దీంతో హైద‌రాబాద్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణాల నుంచి కూడా ఎక్కువ‌మంది కోడి పందాల‌కు హాజ‌ర‌వుతూ వ‌స్తున్నారు. అయితే పందెం కోళ్ల‌కు బ్రాండెడ్‌ను క‌ల్పించుకోవ‌డంలో ఇప్ప‌టికే ఏలూరు లాంటి ప్రాంత‌వాసులు స‌క్సెస్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని పందెం కోళ్ల‌కు మంచి గిరాకీ ఉందంట‌. ఒక్కో కోడిని రూ. 5000 నుంచి 10,000 వ‌ర‌కు విక్ర‌యిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రికొన్నింటికైతే...ట్రైనింగ్ ఇచ్చి..పెంచిన వాటికి రూ.20000 పైమాటేన‌ని చెబుతున్నారు. పందెరాయుళ్లు పండుగకు చాలా కాలం ముందు నుంచే ఇలా క‌స‌ర‌త్తు ప్రారంభించ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది. చూడాలి ఈ సారి ఏ రేంజ్‌లో పందాలు సాగుతాయో..!