అమెరికాలో మళ్లీ అదే భయం

May 27, 2020

అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై 2001 సెప్టెంబర్‌ 9 జరిగిన దాడి గుర్తుందిగా.  ఆ దాడి తర్వాత చాలాకాలం పాటు అమెరికా వీధులు నిర్మానుష్యమయ్యాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పక్కవాడు టెర్రరిస్టేమోనని అందర్నీ అనుమానంగా చూశారు. 9/11 విషాదం నుంచి బయటపడటానికి అమెరికన్లకు చాలాకాలం పట్టింది. ఇప్పుడు కరోనా రూపంలో మళ్లీ అలాంటి ఉపద్రవమే అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు కూడా ఆ దేశం మొత్తం ఒక విధమైన భయం గొలిపే వాతావరణం నెలకొంది. ప్రజలు అత్యంత అవసరమైతే తప్ప గడప దాటడానికి ఇష్టపడటం లేదు. తమంతట తామే ఇళ్లలో బందీలవుతున్నారు. రోడ్లపై రద్దీ బాగా తగ్గిపోయింది. పక్కింటి వ్యక్తి గొంతు సవరించుకున్నా, కరోనా వ్యాధిగస్తుడేమోనని అనుమానంగా చూస్తున్నారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, నిత్యావసరాలు స్టోర్‌ చేసుకోవాలని ప్రభుత్వం కూడా సూచించింది. దీంతో జనం ఇంకా పానిక్ అయ్యారు. రెండు, మూడు నెలలకు సరిపడా రేషన్ ఒకేసారి కొనుక్కోవడానికి స్టోర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో స్టోర్లలో రద్దీ ఏర్పడింది. ర్యాకుల్లోని వస్తువులు పెట్టినవి పెట్టినట్లు మాయమవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధ ఉత్పత్తులు హాట్‌ కేకుల్లా మారాయి. చేతులు శుభ్రపరుచుకునే శానిటైజర్లు, టాయిలెట్లలో ఉపయోగించే పేపర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అవైతే అసలు స్టోర్లలో దొరకడం లేదు. చాలా ప్రాంతాల్లో వాటిని బ్లాక్‌ మార్కెట్‌లోనే కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. వాటి రేటు కూడా వందల రెట్లు పెరిగింది. అమెరికాలో రికార్డు చేసిన ఓ వీడియోలో... ఓ వ్యక్తి ఓ పెద్ద డాలర్ల కట్ట ఇచ్చి  ఓ చిన్న శానిటైజర్, టాయిలెట్‌ పేపర్‌ రోల్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో కొంటున్న దృశ్యం వైరల్‌గా మారింది. అమ్మినవ్యక్తి కూడా వాటిని రహస్యంగా జాకెట్‌లో దాచుకొచ్చి మరీ ఇచ్చాడు. నిజానికి ఆ డాలర్ల కట్టకు మూడు నెలల సరుకులు కొనొచ్చు. కానీ, పరిస్థితులు తలకిందులయ్యేసరికి ఓ శానిటైజర్‌, పేపర్‌ రోల్‌కు ఆ డబ్బు సరిపోయింది.

ఇక సూపర్‌ మార్కెట్లలోనేతై టాయిలెట్‌ పేపర్ల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఉపయోగించాల్సిన వస్తువు కాబట్టి, జనం పేపర్‌ రోల్స్‌ను బండిళ్ల కొద్దీ కొనుక్కుపోతున్నారు. కేవలం టాయిలెట్‌ పేపర్‌ బండిళ్లతోనే ట్రాలీలు నింపేస్తున్నారు. స్టోర్లలో ఉన్న అరకొర పేపర్‌ బండిళ్ల కోసం కొట్లాటకు దిగుతున్నారు. పక్కవారు తీసుకున్న బండిళ్లను బలవంతంగా లాక్కుంటున్నారు. ఇలాంటి దృశ్యాలు అక్కడ ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి.

ఇక, ట్రంప్‌ను కలిసిన ఇద్దరికి కరోనా ఉందని తేలడం అమెరికన్లలో భయాన్ని మరింత పెంచింది. ఇటీవల బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు హై లెవెల్‌ అధికారులు వైట్‌హౌస్‌లో ట్రంప్ ను కలిశారు. వాళ్లిద్దరూ కరోనా పాజిటివ్‌గా తేలారు. అయితే ట్రంప్‌ను కలిసిన కొన్ని రోజులకు వారిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి కాబట్టి, అమెరికా అధ్యక్షుడికి వచ్చిన ఇబ్బందేమీ లేదని వైట్‌హౌస్‌ డాక్టర్లు తేల్చి చెప్పారు. కరోనా టెస్టు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. అయితే ట్రంప్‌ను క్లోజ్‌గా వాచ్‌ చేస్తుంటామని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి కుమార్తె, ట్రంప్ సలహాదారు ఇవాంక ఇటీవలే ఆస్ట్రేలియా హోంశాఖ మంత్రితో చర్చలు జరిపారు. ఈ మీటింగ్ తరువాత హోంశాఖ మంత్రికి కరోనా సోకినట్లు తేలడంతో ఇవాంక కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఆమె శరీరంలో ఎలాంటి వైరస్ లేదని తేలినప్పటికీ, ఇంటి నుంచే పని చేస్తున్నారు. అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 2100కు చేరింది. ఇప్పటికే 41 మంది మరణించారు.  దీంతో అమెరికా ప్రభుత్వం నేషనల్ హైఅలర్ట్  ప్రకటించింది. వైర‌స్ నియంత్ర‌ణ‌కు 50 బిలియ‌న్ డాల‌ర్లను కేటాయించింది.