పాపం జగన్... పదవిస్తే కనీసం కలవలేదు

August 12, 2020

అంతా మన చేతుల్లో ఉన్నట్టే ఉంటుంది.  కానీ అది చాలా సార్లు నిజం కాదు.  మన చేతుల మీద జరిగే నిర్ణయాలు కూడా మనమే చేసినా మన ప్రమేయం లేకుండా జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితే ఇపుడు జగన్ ది కూడా. అంబానీ ఆంధ్ర వచ్చాడు. ముఖ్యమంత్రి జగన్ ని కలిశాడు. జగన్ శాలువా కప్పాడు. ఆయన వెళ్లిపోయాడు. ఇది పైన సీన్... వాస్తవం ఏంటో ఆరోజే గుప్పుమంది. అసలే మండలి రద్దు ప్రతిపాదనతో చాలా మంది ఆశావహులు జగన్ పార్టీలో వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారిలో ముఖ్యులకు న్యాయం చేయాలని జగన్ కూ ఉంది. కానీ ఏం చేద్దాం. ఉన్న మూడు సీట్లలో అంబానీ నాకోటి కావాలి అన్నాడు. 

తన తండ్రిని చంపాడు అంటూ సొంత ఛానెళ్లలో ప్రచారం చేసిన వ్యక్తి, సొంత పేపర్లో రాయించిన వ్యక్తి... ఎక్కడో ఉత్తరాది వ్యక్తికి ఒక ఉత్తరాది వ్యక్తి వచ్చి నా మనిషికి సీటివ్వు అన్నాడు. ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చేశాడు. విచిత్రం ఏంటంటే... జగన్ రాజ్యసభ సీటు ఇచ్చిన వ్యక్తి ఇంతవరకు ఏపీకి వచ్చి జగన్ ని కలవలేదు. సీటు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కలవలేదు. ఆయన ఎవరో తెలుసు కదా పరిమళ్ నత్వానీ. గుండె దిటవు చేసుకుని అత్యంత కీలకమైన సమయంలో కీలక మైన పదవి ఇస్తే... కనీసం జగన్ ను కలవకుండా ట్విట్టరులో థాంక్స్ చెప్పేశారు పరిమళ్ నత్వానీ. 

’’నన్ను మీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ గారికి హృదయపూర్వక కృతజ్జతలు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను‘‘ అంటూ సింపుల్ గా ముగించారు. ఇదంతా చూస్తుంటే... జగన్ వారికి పదవి ఇచ్చాడా? జగన్ వారికి పదవి ఇవ్వాల్సి వచ్చిందా? జవాబు అందరికీ తెలుసులే.