పరిటాల శ్రీరాం హీరో అయ్యాడు !

August 12, 2020

హీరో అంటే ఎవరు? 

సినిమాల్లో నటించేవాడా..

విలన్లతో ఫైట్లు చేసేవాడా...

అమ్మాయిలను చిటికెలో పడేసేవాడా...

ఇవేవీ కావు... 

సాటి మనిషి కష్టం, దు:ఖం చూసి చలించేవాడు.

అయితే, పరిటాల శ్రీరాం హీరోనే. 

నిన్న అనంతపురంలో ఒక కుటుంబాన్ని గొప్ప ప్రమాదం నుంచి కాపాడారు పరిటాల శ్రీరాం. అనంతపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో నివసించే ఒక కుటుంబానికి జరిపిన కోవిడ్ పరీక్షల్లో మొత్తం ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందరికీ పాజిటివ్ రావడంతో డీలాపడిపోయారు. ఆరుగురిలో 60 ఏళ్ల వారు కూడా ఉన్నారు. అందరికీ పాజిటివ్ ఉండటంతో ఆస్పత్రికి కూడా వెళ్లలేని స్థితిలో ఆ ఇంట్లోని యువకుడు వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. వారంతా సామాజిక మాధ్యమాల్లో వేశారు. ఆ వీడియోలో కలెక్టరు గారిని చికిత్స కోసం అభ్యర్థిస్తున్నాడు ఆ యువకుడు. అయితే... ఎంత వైరల్ అయినా అధికారుల నుంచి స్పందన రాలేదు. జర్నలిస్టులు కూడా ప్రయత్నం చేసినా ఎవ్వరూ స్పందించలేదు.

ఈ విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరాం వెంటనే తన ట్విట్టరు ఫ్లాట్ ఫాంపై దానిని పోస్టు చేసి...  కలెక్టరును ఇలా అభ్యర్థించారు. 

అనంతపురం జిల్లా కలెక్టర్ @ChandruduIAS  గారు..ఈ కరోనా బాధిత కుటుంబాన్ని కనికరించండి. మానవతా దృక్పధంతో వైద్య సదుపాయాన్ని కల్పించండి. ఒక TDP నాయకుడిగా కాకుండా సాటి మనిషిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను   

ఈ ట్వీటు చూసి స్పందించిన కలెక్టరు ఆ కుటుంబాన్ని ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందించారు. ఈ పని చాలామంది చేసి ఉండొచ్చు. కానీ రాజకీయ ప్రమేయాలను పక్కన పెట్టి, ప్రభుత్వాన్ని విమర్శలు చేసే అవకాశం ఉన్నా పక్కన పెట్టి... సాటి మనిషిగా అర్థిస్తున్నాను అంటూ పరిటాల శ్రీరాం చేసిన రిక్వెస్ట్ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. హీరోయిజం అంటే ఇదే. దర్పం, దౌర్జన్యం కాదు.. పరిటాల వారసుడా నువ్వు సూపర్ అంటూ అందరూ అభినందనలు చెప్పారు.