#patientYCP ఇండియా లెవెల్లో ట్రెండింగ్.. ఎందుకు?

December 05, 2019

#patientYCP.. నిన్న సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఈ రోజు ఈ హ్యాష్ ట్యాగ్ మీద ట్వీట్లు అంత‌కంత‌కూ పెరిగి ఇండియా లెవెల్లో టాప్-10 ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ జాబితాలోకి వెళ్లిపోయిందిది. ఇంత‌కీ ఏంటీ హ్యాష్ ట్యాగ్.. ఎందుకిది ఆ రేంజిలో ట్రెండ్ అవుతోంది. చూద్దాం ప‌దండి.
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను పార్టీ నాయ‌కుల‌తో క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ తాము చెప్పిన స‌మ‌స్య‌ల గురించి ఓపిగ్గా విన్న‌ట్లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్వీట్ చేశాడు. ఈ క్ర‌మంలో My wholehearted Namaskars to Hon.Governor of AP Sri Harichandan ji for his patient hearing and support. అని ఇంగ్లిష్‌లో మెసేజ్ పెట్టాడు ప‌వ‌న్. 

ఐతే ఇక్క‌డ పేషెంట్ అనే ప‌దానికి అర్థం ఓపిక అని. కానీ ప‌వ‌న్ ఏం మాట్లాడినా.. ఏం చేసినా విమ‌ర్శించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లు ఈ ట్వీట్లోని పేషెంట్ అనే ప‌దాన్ని అపార్థం చేసుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ నిక్షేపంగా ఉంటే.. పేషెంట్ అంటావా అంటూ ప‌వ‌న్ మీద ప‌డిపోయారు. వైకాపా త‌ర‌ఫున ట్విట్ట‌ర్లో గ‌ట్టిగా గ‌ళం వినిపిస్తూ బాగా పాపుల‌ర్ అయిన వాళ్లే కొంద‌రు పేషెంట్ అనే ప‌దానికి ఈ ర‌క‌మైన అర్థంతో ట్వీట్లు వేయ‌డం గ‌మ‌నార్హం. 
ఇక్క‌డ ఆ ప‌దానికి అర్థం అది కాద‌న్నా కూడా వాళ్లు వినిపించుకోలేదు. త‌మ ట్వీట్ల‌కు క‌ట్టుబ‌డే ఉన్నారు. వాటిని డెలీట్ కూడా చేయ‌లేదు. ఇక ట్విట్ట‌ర్లో చాలా యాక్టివ్‌గా ఉండే జ‌న‌సైనికులు, యాంటీ జ‌గ‌న్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? వైకాపా వాళ్ల ఇంగ్లిష్ ప‌రిజ్ఞానం, వారి అవ‌గాహ‌న స్థాయి ఇదీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ వేశారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ వైర‌ల్ అయిపోయింది. టాప్ ట్రెండింగ్ లిస్టులోకి ఎక్కేసింది.