పట్టిసీమ...పై దొంగదెబ్బ, కృష్ణా డెల్టా కన్నీరు

July 05, 2020

పట్టి సీమ ... కేవలం 1300 కోట్లతో మూడేళ్లలో 300 టీఎంసీలను గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించిన అత్యంత ఫలవంతమైన ఎత్తిపోతల. కానీ ఈసారి అది ఎత్తిపోయింది. రైతులు, సమాజ సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం చంద్రబాబు మీద పగతో పట్టి సీమ నీళ్లను వదలకుండా ఆపేశారు. దీంతో పట్టి సీమ మీద ఆశలు పెట్టుకుని పంటలు వేయడానికి సిద్ధమైన రైతులు తీవ్రమైన మనోవేదనతో ఉన్నారు. ఈ సారి ఖరీఫ్ పంటలపై ఆశలు వదులుకోవాల్సిందేనా అని తీవ్రమైన ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పోలవరం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి పనులు ఆపినా ఇప్పటికిపుడు పెద్దగా ఒరిగేదేమీ లేదు. కానీ చక్కగా పారే గోదారమ్మను ఆపేస్తే ఎలా? ఇప్పటికే రుణమాఫీ ఇవ్వకుండా రైతులపై కక్ష తీర్చుకున్న జగన్ పట్టిసీమ ఆపేసి కృష్ణా డెల్టా రైతుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆ ప్రాంత ప్రజల్లో జగన్ కి ఓటేసిన వాళ్లందరూ అంతర్మథనానికి గురవుతున్నారు. సుమారు 13 లక్షల ఎకరాల్లో సిరుల పంటకు సాక్ష్యంగా నిలిచిన పట్టిసీమ ఆగిపోవడంతో రైతులు హాహా కారాలు చేస్తున్నారు. రుతుపవనాలు కూడా ఆలస్యం కావడంతో పొలం కూడా చదును చేయలేకపోతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి పొలాలు పట్టిసీమ నీటితో పులకరించాయి. కానీ ఈసారి నీళ్లు లేవు, పంటా లేదు.
ఏడాదిలో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అని చెప్పిన జగన్ నెల రోజుల్లోపే చెడ్డ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. స్వార్థం, ఇగోతో అనేక వర్గాలపై పరోక్షంగా కక్ష సాధిస్తున్నారు.