అలీ మోసాన్ని బయటపెట్టిన పవన్

July 04, 2020

తెలుగు రాష్ట్రాల్లో ఆ మధ్య హాట్ టాపిక్‌గా నిలిచారు ప్రముఖ సినీ నటుడు అలీ. పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించిన ఆయన ఎన్నో రోజులు సస్పెన్స్ కొనసాగించారు. వాస్తవానికి అలీ పొలిటికల్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని చెప్పగానే అందరూ జనసేనలోకి వెళతారని భావించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీతో అలీకి ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అలీ మాత్రం దానిపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డితో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత జనసేనానితో సైతం మంతనాలు జరిపారు. ఇలాంటి సమయంలో అసలు అలీ ఏ పార్టీలో చేరుతున్నారనే విషయంపై మాత్రం చాలా రోజులు క్లారిటీ రాలేదు. కానీ, చివరకు ఆయన వైసీపీలోనే చేరారు.

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన తర్వాత అలీ మీడియాతో మాట్లాడిన సమయంలో పవన్ గురించి స్పందించారు. రాజకీయాలు వేరు, ఫ్రెండ్‌షిప్ వేరు అంటూనే ఆయన సక్సెస్ అయితే తాను సక్సెస్ అయినట్టు ఫీలవుతానని కామెంట్ చేశారు. అయితే, ఆ తర్వాత వైసీపీకి సంబంధించిన కొన్ని ప్రచార సభల్లో కనిపించారాయన. అలీ వైసీపీలో చేరినప్పటి నుంచి పవన్ అభిమానులు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ మంచి పాత్రను పోషించారు. అంతేకాదు తన సినిమాలో అలీ లేకుంటే ఏదో వెలితి ఉంటుందని పాత్ర ఉన్నా లేకపోయినప్పటికీ అలీ కోసమే ఓ ప్రత్యేక పాత్ర సృష్టిస్తామని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. అలీ అంటే తనకు ఒక రకమైన సెంటిమెంటు అని చెప్పేవారు. ఇలాంటి అలీ వైసీపీలో చేరడాన్ని జనసేన కార్యకర్తలు అస్సలు జీర్ణించుకోవడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో అలీ‌పై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోమవారం రాజమహేంద్రవరంలో పర్యటించిన జనసేనాని ‘‘అలీ కష్టాల్లో ఉన్న సమయంలో నేను ఆదుకున్నాను. ఆ తర్వాత ఆయనకు అండగా నిలిచాను. మొన్నామధ్య ఆయన పరిచయం చేసిన వ్యక్తిని నమ్మి నేను నరసరావుపేట ఎంపీ టిక్కెట్ ఇచ్చాను. కానీ నా స్నేహితుడు మాత్రం వైసీపీలోకి వెళ్ళాడు. అలీకి ఏదైనా అవసరం వస్తే అండగా ఉన్నా. అలాంటి వాళ్లే వదిలేస్తే ఏం చేయాలి? ఇదేనా స్నేహం? అందుకే నేను స్నేహితులను, బంధువులను నమ్మడం మానేసాను. అలీ లాంటి వ్యక్తికి ఎప్పుడు ప్రేమగా ఉంటే అటువంటి వారు కూడా నన్ను నమ్మలేదు. నా గెలుపును నమ్మలేదు. వైసీపీ గెలుస్తుందనుకుని అటు వెళ్లాడు. ఈరోజు వైసీపీ వాడుకొని వదిలేసింది. అటువంటి వారు నాకు అవసరం లేదు, నేను మిమ్మల్ని మాత్రమే నమ్మాను’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.