చ‌ర‌ణ్‌తో సినిమా ఉందంటున్న ప‌వ‌న్‌

August 07, 2020

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను మ‌ళ్లీ ప‌వ‌ర్ స్టార్‌గా చూడాల‌ని ఆశ‌ప‌డుతున్నారు అభిమానులు. గ‌త ఏడాది అజ్ఞాత‌వాసి త‌ర్వాత ప‌వ‌న్ సినిమాల‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల అనంత‌రం ప‌వ‌న్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడ‌ని ప్ర‌చారం మొద‌లైంది. కానీ దీనిపై స్ప‌ష్ట‌త రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఎట్ట‌ల‌కేల‌కు ప‌వ‌న్ అడుగులు ఆ దిశ‌గా ప‌డుతున్న‌ట్లే ఉన్నాయి. పింక్ రీమేక్‌తో ప‌వ‌న్ రీఎంట్రీ ఖ‌రారైన‌ట్లే క‌నిపిస్తోంది.
తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్‌ను సినిమాల గురించి ప్ర‌శ్నిస్తే స్ప‌ష్టంగా స‌మాధానం ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న మాట వాస్త‌వ‌మే అని.. కానీ త‌న‌కు సినిమాల గురించి మాట్లాడ్డంపై అంత ఆస‌క్తి లేద‌ని.. రాజ‌కీయాలు, ప్ర‌జా స‌మ‌స్య‌ల చుట్టూనే త‌న ఆలోచ‌న‌లు తిరుగుతున్నాయ‌ని చెప్పాడు. ఒక‌ న‌టుడిగా మాన‌సిక స్థాయిని తాను దాటేసిన‌ట్లు అనిపిస్తోంద‌ని ప‌వ‌న్ చెప్పాడు.
ఐతే సినిమాల్లో న‌టించ‌డం సంగ‌తేమో కానీ.. తాను సినిమాలు నిర్మించ‌డం మాత్రం త‌ప్ప‌క జ‌రుగుతుంద‌ని ప‌వ‌న్ చెప్పాడు. ఇంత‌కుముందు ప్ర‌క‌టించిన‌ట్లే త‌న అన్న కొడుకు రామ్ చ‌ర‌ణ్ హీరోగా సినిమా నిర్మించ‌డం ప‌క్కా అని ప‌వ‌న్ తేల్చి చెప్పాడు. ఐతే ఆ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌రు.. క‌థేంటి.. ఎప్పుడు మొద‌ల‌వుతుంది అనే విష‌యాలు మాత్రం తాను ఇప్పుడేమీ చెప్ప‌లేన‌ని ప‌వ‌న్ తెలిపాడు. బ‌హుశా చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ పూర్తి చేశాక‌ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉంటుంద‌ని భావిస్తున్నారు.