పవన్ ... ధైర్యంగా చెప్పేశాడే 

May 28, 2020

జగన్ ఎమోషనల్ నిర్ణయాలతో చంద్రబాబుకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలో పేదలకు భూములు కేటాయించడం అలాంటి నిర్ణయాల్లో ఒకటి. కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన సుమారు 50 వేల మంది లబ్ధిదారులకు అమరావతి రైతుల నుంచి సేకరించిన భూములను జగన్ కేటాయించారు. 33 వేల ఎకరాల్లో సుమారు 1250 ఎకరాల భూమిని వీరికి కేటాయించారు. ఒక్కో పేదవాడికి ఒక సెంటు భూమి ఇస్తారు. సెంటు భూమి అంటే 48 గజాలు. అమరావతిలో రాజధాని కోసం కేటాయించిన భూములను పేదల ఉచిత స్థలాల కోసం కేటాయించడం ప్రతిపక్షాన్నే కాదు, రాష్ట్రప్రజలందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వం ఒక ఉద్దేశంతో రైతుల నుంచి భూమిని సేకరించి ఇలా మరో ఉద్దేశంతో భూములు పంచడం వివాదాస్పద నిర్ణయంగా పరిగణించాలి.

ఉగాది లోపు పేదలందరికీ 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరాచక వ్యవస్థే నడుస్తోంది. పేదల భూములు బలవంతంగా సేకరించి మరో వర్గపు పేదలకు పంచడం, అమరావతి భూములు పంచడం, చేతికొచ్చిన పంట భూములు నాశనం చేయడం వంటివెన్నో చేస్తున్నారు. ఈ పథకం ద్వారా జరుగుతున్న లబ్ధి కంటే డ్యామేజ్ ఎక్కువగా ఉంది. పేదలకు అమరావతిలో భూములు ఇవ్వడం పూర్తిగా తప్పు అయినా చంద్రబాబు దాన్ని కాదనలేడు, తద్వారా బాబును ఇరుకున పెడదాం అన్నది జగన్ ఆలోచన. అవి రాజధానికి సేకరించిన భూములు మరోచోట పేదలకు ఇవ్వండని చంద్రబాబు అంటాడేమో అని వైసీపీ ఆశ. అలా చెబితే చంద్రబాబును పేదల శత్రువుగా చిత్రీకరిద్దామని ప్లాన్. ఒకవేళ అనకపోతే... రైతుల్లో బాబును విలన్ ను చేద్దామని ప్లాన్ ఎటుచూసినా చంద్రబాబు టార్గెట్ గా ఆ భూమిని పేదలకు పంచుతున్నారు జగన్. 

దీనిపై తెలుగుదేశం స్పందించలేదు. కానీ.. పవన్ మాత్రం స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తప్పు అని, ఈ పని ద్వారా పేదలకు మేలు చేసినట్టు కాదు అని, ఇరుకున పెట్టినట్టే అని అంటున్నారు పవన్. వివాదాస్పద భూములు పంచడం ద్వారా ప్రజల మధ్య జగన్ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పవన్ విమర్శించారు. ఒక  వైపు అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం తప్పని పవన్ అన్నారు. పేదలకు స్థలాలు ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పు పట్టరు, కానీ ఇలాంటి వివాదాస్పద భూమి ఎందుకు ఇవ్వడం, రేపు ఇది కోర్టులో ఆగిపోతే... అనవసరంగా పేదలను జగన్ ఇబ్బంది పెట్టినట్టే అన్నారు పవన్. మీకు పేదలకు స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే... వివాద రహిత భూములను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.