ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌వ‌ర్.. ట్విట్ట‌ర్లో ఇండియా నెం.1

February 25, 2020

హైద‌రాబాద్‌లో వెట‌ర్న‌రీ వైద్యురాలిని రేప్ చేసి చంపేస్తే.. నిందితుల్ని ప‌ది రోజుల్లోనే ఎన్‌కౌంట‌ర్ చేసి ప‌డేశారు పోలీసులు. దీని ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌య్యాయి. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం జ‌రిగిందంటూ అంద‌రూ ఆనందం ప్ర‌క‌టించారు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుగాలి ప్రీతి అనే పేద అమ్మాయిని రేప్ చేసి ఆమె చావుకు కార‌ణ‌మైన వాళ్ల‌ను ఇప్ప‌టిదాకా శిక్షించ‌లేదు. ఈ ఉదంతంపై అప్ప‌టి తెలుగుదేశం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. ఇప్ప‌టి జ‌గ‌న్ స‌ర్కారూ స్పందించ‌ట్లేదు. బాధితురాలి త‌ల్లిదండ్రులు అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నా వారికి న్యాయం జ‌ర‌గ‌డం లేదు. దీంతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను వాళ్లు క‌లుసుకుని త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు.
ప్రీతికి జ‌రిగిన అన్యాయంపై క‌దిలిపోయిన ప‌వ‌న్.. ఆమెకు న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని హామీ ఇచ్చి ప‌లు వేదిక‌ల్లో ఆమె గురించి మాట్లాడాడు. ఈ కేసును ప‌రిష్క‌రించాల‌ని.. నిందితుల్ని శిక్షించాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్‌ను డిమాండ్ చేశాడు. స్పందించ‌కుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాన‌ని కూడా హెచ్చ‌రించాడు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఈ ఇష్యూను మ‌రింత‌గా జ‌నాల్లోకి తీసుకెళ్లే ప‌నిలో ప‌డ్డారు జ‌న‌సైనికులు. ట్విట్ట‌ర్లో సుగాలి ప్రీతి గురించి పెద్ద ఎత్తున ట్వీట్లు వేస్తున్నారు. జ‌స్టిస్ ఫ‌ర్ సుగాలి ప్రీతి అనే హ్యాష్ ట్యాగ్‌ను ఆదివారం పెద్ద ఎత్తున ట్రెండ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు జ‌న‌సైనికులు. జ‌గ‌న్ స‌ర్కారు ప‌ట్ల ఆగ్ర‌హంతో ఉన్న మిగ‌తా నెటిజ‌న్లు కూడా రంగంలోకి దిగ‌డంతో ఈ హ్యాష్ ట్యాగ్ ఆదివారం ఇండియా లెవెల్‌లో టాప్‌-1 స్థానంలో ట్రెండ్ కావ‌డం.. 2 ల‌క్ష‌ల‌కు పైగా ట్వీట్లు ప‌డ‌టం విశేషం. దీంతో ఈ ఇష్యూ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది.