న‌డిబ‌జార్లో సాక్షి ప‌రువు తీసేసిన ప‌వ‌న్

February 24, 2020

కాకినాడలో జరిగిన రైతు సౌభాగ్య దీక్షలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒకప్పుడు రైతు ఇంట్లో పెళ్లి జరగాలంటే పంట అమ్ముకుంటే సరిపోయేది.. కానీ ఇప్పుడు భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. ఇలాంటి పరిస్థితి నుంచి రైతులు గట్టెక్కాలన్నారు ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి గారు ఇంటింటికీ తీసుకువచ్చి ఇస్తామన్న బియ్యం ఏది? వారు చెప్పిన అసలు బియ్యం ఏది? అని ప‌వ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు.
కాకినాడ రైతు సౌభాగ్య దీక్ష వేదికపై ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని శాంపిల్స్ ను  పవన్ కళ్యాణ్‌కు జనసేన నాయకుడు లీలాకృష్ణ అందచేశారు. ప్రభుత్వం ఇస్తానని వాగ్దానం చేసిన అసలైన సన్న బియ్యం శాంపిల్స్ కూడా జనసేనానికి చూపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మాట తప్పిన బియ్యం ఏది? మాటిచ్చిన బియ్యం ఏది?” అని అడగగా... లీలాకృష్ణ వాటిని వివ‌రించారు. ``మా పేపర్ తప్పు చేసింది నాకు సంబంధం లేదన్నారే`` అని జనసేనాని ప‌రోక్షంగా సాక్షిని ఎద్దేవా చేశారు. `ఆయన పేపర్లో వేసేవి అన్నీ తప్పులే కదా సర్?` అంటూ లీలాకృష్ణ బదులివ్వ‌గా దీన్ని బట్టి అర్ధం చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ చుర‌క అంటించారు.

ఈ సంద‌ర్భంగా బియ్యంలో తేడాలను స్థానిక రైతులు వివరిస్తూ “ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం పథకం కోసం కస్టం మిల్లింగ్ విధానం తీసుకువచ్చింది. ఈ విధానంలో రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి దగ్గర్లో ఉన్న మిల్లులకు తోలుతుంది. క్వింటాల్ కి 67 కేజీలు మిల్లర్ ప్రభుత్వానికి తిరిగివ్వాలి. తవుడు, నూకతోపాటు కొంత ఛార్జ్ కూడా మిల్లర్ కి చెల్లిస్తారు. అయితే గత ప్రభుత్వం హయాంలో 25 శాతం వరకు ముక్కను, 17 శాతం వరకు తేమను ఈ విధానంలో అనుమతించేవారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకోవాలని ఆ నిబంధన పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వరకు ఆ నిబంధనలే అమల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి సన్నబియ్యం కోసం మిల్లర్ల దగ్గర నిల్వ ఉన్న బియ్యాన్ని తీసుకుని రీ సైక్లింగ్ చేసి పంపారు. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ సన్న బియ్యం అమలు చేయగా, అవి కాస్తా ముద్ద అయిపోయాయి. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో స్వర్ణ రకం బియ్యాన్ని సార్టెక్స్ మిల్లులో వేసి హామీని నిలబెట్టుకునేందుకు ఇన్ని లక్షల మంది కడుపు కొడుతున్నారు.`అని వ్యాఖ్యానించారు.