వైసీపీకి పవన్ వార్నింగ్ !!

February 21, 2020

పవన్ కళ్యాణ్ రాజధాని పర్యటన కలకలం రేపింది. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని... నోరు అదుపులో పెట్టుకుని, పాలన జాగ్రత్తగా చేయాలని పవన్ వైకాపాను హెచ్చరించారు. మీ ఇడుపులపాయ బాగుండాలి, మీ సిమెంట్ ఫ్యాక్టరీలు బాగుండాలి... అమరావతి రైతులు మాత్రం రోడ్డు మీద పడాలా? అని జగన్ ను ప్రశ్నించారు పవన్. 

ఇంతమంది ఆడపడుచులు రోడ్ల మీదకు వచ్చి కన్నీరు పెట్టుకోవడం ఏనాడూ చూడలేదని, మీ కన్నీళ్లు నా కడుపు తరుక్కుపోయేలా చేశాయని... అమరావతిపై పోరాటం ఆపొద్దని, రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్న వారి దిమ్మ తిరిగి దిగి వచ్చే వరకు పోరాటం చేయాలని పవన్ సూచించారు. మీకు పూర్తి న్యాయం జరిగే వరకు జనసేన మీతోనే ఉంటుందని పవన్ వారికి హామీఇచ్చారు.

అమరావతి రైతులకు న్యాయం జరగకుండా అమరావతి ఇక్కడి నుంచి అంగుళం కూడాముందుకు కదలడానికి వీల్లేదని పవన్ వ్యాఖ్యానించారు. పోరాట స్ఫూర్తి నింపుకోండి. మీరు పోరాడినంత కాలం జనసేన మీకు అండగా ఉంటుంది. పోరాటం ఆపితే నష్టపోతారు. ఇక్కడ నాయకులే బలిశారు. ప్రజలు కాదు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. రాజధాని కోసం ప్రభుత్వానికి సహకరించి భూములు ఇస్తే... ఈరోజురు తిరిగి భూమి తీసుకోండి అంటారా? హద్దులు చెరిపేశాక భూములు ఎలా దున్నుకుంటారు? ఎవరి పొలం ఏదో ఎలా తెలుస్తుంది. ఆల్రెడీ భవనాలు కట్టిన వారి పరిస్థితి ఏంటి? పరిపాలన వదిలేసి లేనిపోని సమస్యలతో కాలం వెళ్లబుచ్చుతారా అంటూ పవన్ ధ్వజమెత్తారు. 

వైసీపీ న్యాయం చేస్తుందని ఓట్లేసి గెలిపిస్తే.. జగన్ వారికి ఇచ్చే కానుక ఇదేనా? అంటూ జనసేన అధినేత నిలదీశారు. రైతులు చేపట్టిన రిలే దీక్షల శిబిరాలను సందర్శించడానికి బయలుదేరిన పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మందడం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఏర్పాటుచేసిన కంచెను దాటుకుని వెళ్లి దీక్ష శిబిరంలో కూర్చున్నారు పవన్.