చంద్రబాబు ప్లాన్‌తో పవన్‌ ఇరుక్కున్నారా..?

August 11, 2020

జనసేన అధినేత గమ్యం ఎటు వైపు..? తెలుగుదేశం పార్టీతో ఆయన రిలేషన్ ఏ విధంగా ఉంది..? చంద్రబాబు వేసిన ప్లాన్‌లో పవన్ ఎలా ఇరుక్కున్నాడు..? ఇటీవల కొన్ని వార్తలు చూసిన తర్వాత సగటు ఓటరుకు కలిగిన ప్రశ్నలివి. విభజనానంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన పవన్.. ఆ తర్వాత కూడా ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు. గత సంవత్సరం గుంటూరులో జరిగిన జనసేన నాల్గవ ఆవిర్భావ సభ నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలుగుదేశం ప్రభుత్వంపై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు, 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నా.. ఈ ఎన్నికల్లో మాత్రం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన చెబుతున్నారు. అలాగే, జనసేన.. వామపక్షాలతో తప్ప ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని కూడా పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు కూడా జనసేనానిని టార్గెట్ చేశారు. ఇలా ఈ రెండు పార్టీల మధ్య వార్ నడుస్తున్న సమయంలో జనసేన-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వచ్చాయి. ఈ పరిణామం తర్వాత తెలుగుదేశం పార్టీ పవన్‌తో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నాలు చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 

చంద్రబాబే ప్లాన్ ప్రకారం పవన్‌ను దెబ్బకొట్టారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, టీడీపీ అధినేత వేసిన ప్లాన్‌లో పవన్ ఇరుక్కుపోయాడని, దీని వల్ల ఆయన చాలా కోల్పోతున్నారనే టాక్ వినిపిస్తోంది. కొద్దిరోజులక్రితం చంద్రబాబు ‘‘టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే జగన్‌కు నొప్పి ఏంటి..? పవన్ కళ్యాణ్ మాతో రాకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్‌ను జగన్ తిడుతున్నాడు. ఒకవేళ కలిసి పోటీ చేస్తే ఆయనకు బాధేంటి? ముందు జగన్‌ తన సంగతి చెప్పాలి. ఆయన బీజేపీతో కలుస్తాడా లేదా? దేశంలో ఆయన ఎక్కడ ఎవరితో ఉంటారో అది చెప్పాలి. పవన్‌ రాకూడదన్నది ఆయన బాధ. ఈ మధ్య నేను కూడా చూస్తున్నా. పవన్‌ కల్యాణ్‌ను తిడుతున్నాడు. జగన్‌ ఇతరుల గురించి కాదు. ముందు తన సంగతి చెప్పాలి’’ అంటూ చేసిన కామెంట్‌తో వ్యవహారం మొత్తం మారిపోయింది. అప్పటి నుంచి టీడీపీ నేతలు పవన్‌పై సానుకూలంగా మాట్లాడుతున్నారు. అటు పవన్ కూడా గతంలో మాదిరిగా విమర్శలు చేయడం తగ్గించారు. దీని వల్ల జనసేన-టీడీపీ ఒక్కటేననే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. అలాగే టీడీపీ వెంటే జనసేన ఉంటుందని అనుకునేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. దీనితో పాటు పవన్ అభిమానులు కూడా టీడీపీ పట్ల సానుకూల దృక్పధాన్ని చూపిస్తున్నారు. సో.. చంద్రబాబు వేసిన ఓ ప్లాన్ పవన్‌ను ఆయనకు తెలియకుండానే ఇరుకున పెట్టిందన్న మాట..!