జగన్ కి సూపర్ ఐడియా ఇచ్చిన పవన్

February 16, 2020

ఏపీ సర్కారు ప్రతివిషయంలో విమర్శల పాలవుతూ వస్తోంది. అవసరమైన పథకాలు పెడుతున్నా వాటి అమలులో జగన్ సర్కారు ఘోరంగా ఫెయిలవుతోంది. ఉల్లిపాయల పంపకాన్ని కూడా సమర్థంగా నిర్వహించలేకపోవడంతో జనం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ఉల్లిపాయల పంపిణీ కేంద్రంలో క్యూలో నిలబడిన ఓ పెద్దమనిషి సొమ్మసిల్లి కిందపడి చనిపోయారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తి సాంబయ్య అని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా... దీనిపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి అనుభవ రాహిత్యంతో రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయని పవన్ విమర్శించారు. ఉల్లికోసం జనాల్ని జగన్ గంటల కొద్దీ క్యూలో నిలబెట్టడం ఏందని ప్రశ్నించారు. ప్రజా ధనంతో నియమించిన గ్రామ వలంటీర్ల చేత ఉల్లిపాయలు పంపిణీ చేస్తే ఈ ఘోరం జరిగేది కాదు కదా అని పవన్ అన్నారు. రాజకీయ లాభం కోసం... కావాలనుకుంటే ’’జగనన్న ఉల్లిపాయ పథకం’’ అని పేరు పెట్టుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు గాని ప్రజలకు మాత్రం ఇబ్బంది పెట్టకుండా సేవలు అందజేయాలని పవన్ కోరారు. 

జగన్ కి ప్రతిపక్షాలను వేధించడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, కూల్చివేయడం, మత మార్పిడుల మీద తప్ప వేరే విషయాల మీద ఆసక్తి లేదని... ప్రజల సమస్యలపై ప్రభుత్వం ఆసక్తి చూపితే ఉల్లిపాయల సమస్య ఇంత ఘోరంగా ఉండేది కాదన్నారు.