చరిత్రను తవ్వి కేసీఆర్ ను కెలికిన పవన్

July 09, 2020

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మరో పార్టీ మద్దతు లభించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో పాటు.. పలు దీర్ఘకాలిక సమస్యలపై గళం విప్పారు కార్మికులు. అందులో భాగంగా సమ్మె చేస్తున్న కార్మికులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ కావటం.. చర్యలకు వెనుకాడకపోవటం.. యాభై వేలకు పైగా కార్మికుల ఉద్యోగాల్ని తీసేస్తున్నట్లుగా వెల్లడించటం సంచలనంగా మారింది.
ఇప్పటికే కేసీఆర్ తీరును పలు విపక్షాలు తప్పు పట్టాయి. ఇప్పుడా జాబితాలోకి జనసేన కూడా చేరింది. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేసే కార్మికుల విషయాన్ని సానుభూతితో అర్థం చేసుకొని పరిశీలించాలే తప్పించి కఠినమైన నిర్ణయాలు తీసుకోకూడదని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ కు ఆరోగ్యం బాగోలేదన్న మాట వినిపించటమే కాదు.. దీనికి తగ్గట్లే వారాల తరబడి ఎక్కడ కనిపించని పరిస్థితి. అలాంటిది.. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ.. తన్ సంతకంతో ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె నేపథ్యంలో 48,660 మంది ఉద్యోగుల్లో 1200 తప్పించి మిగిలిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లుగా సీఎం కేసీఆర్ చేసినట్లుగా వస్తున్న వ్యాఖ్యలు కలవరానికి గురి చేస్తున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మెలో పదిహేను రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసిన వైనాన్ని గుర్తు చేశారు. వారి త్యాగాల్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాలు సంయమనంతో వ్యవహరించి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ప్రజలకు కష్టం కలగకుండా చూసుకోవాలని కోరిన పవన్.. ఉద్యోగుల పట్ల ఉదారత చూపాలని కేసీఆర్ ను కోరారు. నాడు కేసీఆర్ చేసిన ఉద్యమంలో భాగంగా చేపట్టిన సమ్మెకు సాయంగా నిలిచిన వైనాన్ని పవన్ గుర్తు చేయటం.. సారు తీరు మార్చుకోవాలంటూ చెప్పిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.