కళ్లు తెరిచిన జనసేనాని... నిర్ణయం మార్చుకున్నాడు

August 12, 2020

రాజధానిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం అర్థం కావడంతో పవన్ మేలుకున్నారు.  ఆలస్యంగా అయినా పవన్ కళ్యాణ్ సరైన వాదన వినిపించారు. ఎన్నికలకు ముందు  అధికారంలోకి వస్తే ఏవేవో చేస్తాం అని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీల్లో అమరావతిని మార్చుతాం అని కూడా హామీ ఇచ్చిఉంటే ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించేవారు కాదు. కానీ అమరావతి మార్చం, అమరావతిలోనే రాజధాని ఉంటుంది... అని పదేపదే చెప్పి ప్రజల్ని మాయమాటలతో మోసగించిన వైసీపీదే బాధ్యత. 

వైసీపీకి రాజధానిపై చిత్తశుద్ధి ఉంటే.. కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు పోవాలి. అదే సమయంలో టీడీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి ప్రజాభిప్రాయాన్ని కోరాలి. ప్రత్యక్ష పోరాటంలో ప్రజల్లో ఎవరి అభిప్రాయానికి విలువ ఉందో తేల్చుకోవాల్సిన సమయం ఇది. 

రాజధాని వికేంద్రీకరణ పేరిట ఏపీలో ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఈ రాజధాని అనే రాజకీయ క్రీడ వెనుక ఉద్దేశం అభివృద్ధి కాదు, వైసీపీ చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ఇలా చేస్తున్నారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తాం అని పవన్ అన్నారు. ఈరోజు రాజకీయ వ్యవహారాల కమిటీతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పై వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందని చెబుతోంది. అలాంటపుడు దానిని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నిరూపించాలి. కృష్ణా గుంటూరు రెండు జిల్లాల వారు రాజీనామా చేసినా ప్రభుత్వం పడిపోదు. కానీ ప్రజాభిప్రాయం స్పస్టంగా తెలుస్తుంది. కాబట్టి వైసీపీ వెంటనే దీనిపై ప్రజాభిప్రాయం తీసుకోవాలి అని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.