ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న పవన్! భీమవరం చూపంతా..?

July 03, 2020

సమాజంలో అవినీతి పుట్టలు పుట్టలుగా పేరుకుపోయిందని, దాన్ని ఎలాగైనా వేళ్ళతో సహా పీకేస్తానని చెబుతూ జనసేన పార్టీతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు పవన్. అలా వచ్చిన ఆయన ఇప్పటికే ఈ వేదిక పై చాలా సవాలు ఎదుర్కొన్నారు. అలిసారు, సొలిసారు.. ఇక నా వాళ్లు కాదని కూడా అనుకున్నారు..! కానీ చివరకు ఎలాగోలా ఎన్నికల వరకూ వచ్చేశారు పవన్. ఈ ఎన్నికల ద్వారా తొలిసారి ఆయన భీమవరం నియోజకవర్గం కేంద్రంగా పోటీ చేస్తున్నారు. ఆయనకివే మొదటి అసెంబ్లీ ఎన్నికలు.

దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా విక్టరీ సాధించాలని పట్టుదలగా ఉన్న పవన్.. అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులను బేరీజు వేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. జనసేనాని క్షేత్రస్థాయిలో గట్టి బలం లేకపోయినప్పటికీ.. అభిమానగణమే ఆయనకున్న ఏకైక ధైర్యం. పైగా మొదటి నుంచి రాజకీయ చైతన్య దీపిక అయినటువంటి భీమవరంలో ఇప్పటిదాకా పరాయి వ్యక్తులు ఇక్కడి నుంచి పోటీ చేసిన దాఖలాలు లేవు. ఆ కోణంలో చూస్తే పవన్‌ మొట్టమొదటి నేత కావడం విశేషం. ఇదిలా ఉంటే ఇక ప్రతిపక్షాలైన టీడీపీ, వైసీపీలు కూడా భీమవరం స్థానం దక్కించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుండటం జనసేన వర్గాలను కలవరపెడుతున్నాయి.

కాగా.. పోటీ రసవత్తరంగా ఉంటుందని గమనించిన జనసేన పార్టీ నేతలు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భీమవరంలో స్పీడు బాగా పెంచేశారు. పవన్‌ సైతం ఇటీవల భీమవరం స్థితిగతులపై మరోసారి సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జెండా ఎగరేసి తీరాలని పట్టుదలతో ఉన్నారు. తనకు పోటీగా ఉన్న ప్రత్యర్థి పార్టీ అభ్యర్ధులను తక్కువ అంచనా వేయడంలేదు. తెలుగుదేశం పక్షాన అంజిబాబు, వైసీపీ తరపున గ్రంధి శ్రీనివాస్‌.. జనసేనానిని ఢీ కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భీమవరంపై కన్నేసి.. పార్టీ అభ్యర్ధి శ్రీనివాస్‌కు అన్ని సమకూర్చే బాధ్యతను కొందరికి అప్పగించేశారు. అలాగే వ్యూహాలు అమలు చేసే బాధ్యతను మరికొందరికి అప్పగించి.. తమ అభ్యర్థికి ఆర్ధికంగా ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఓట్ల కొనుగోలుకు ఇప్పటికే తెర లేపారు. ఇక ప్రజానాడి తమ వైపే ఉందని ధీమాగా ఉన్న టీడీపీ కూడా కాస్త వేగం పెంచింది. టీడీపీ అభ్యర్థి అంజిబాబు ఆయన సన్నిహితులు సరికొత్త ఎత్తుగడలకు దిగబోతున్నారు. ఉత్కంఠ పోరు నెలకొన్న ఈ పరిస్థితుల మధ్య మరోవైపు బెట్టింగుల జోరు కొనసాగుతోంది. మొదట్లో పవన్‌కు అనుకూలంగా ఇప్పటికే బెట్టింగ్‌లు ఉన్నా.. తీరా ఎన్నికల సమయంలో ఇప్పుడు టీడీపీ వైపు నడుస్తుండటం చూసి జనసేన వర్గాలు కంగుతింటున్నాయి. పవన్ గెలుపు కష్టమే అని ఓ అంచనాకు వచ్చేశాయి జనసేన వర్గాలు. ఈ మేరకు పవన్ సొంత సైన్యం అక్కడ వాలింది. గడిచిన ఐదారు రోజులుగా వారంతా గ్రామాల్లో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎక్కడెక్కడ ప్యాచ్‌ వర్క్‌ చేసుకోవాలో అక్కడక్కడ పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కాకపోతే ఎలా చూసినా భీమవరం ప్రజానాడి మాత్రం టీడీపీ వైపే కొట్టుకుంటోందనేది విశ్లేషకులు చెబుతున్న మాట.