సాక్షి టార్గెట్ చంద్రబాబు కాదా?

January 25, 2020

జగన్ చేసే విమర్శల్లో చంద్రబాబుది రెండో స్థానం

విజయసాయిరెడ్డి చేసే విమర్శల్లో చంద్రబాబును రెండో స్థానం.

సాక్షి టార్గెట్ చేసే వ్యక్తుల్లో చంద్రబాబుది రెండో స్థానం

వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిన వ్యక్తుల్లో చంద్రబాబుది రెండో స్థానం. 

ప్రధాన ప్రతిపక్ష నేత రెండో స్థానంలో ఉంటే... మరి మొదటి స్థానం ఎవరిది అని ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారా? మీ తప్పేం లేదు. కానీ జగన్ టీంకి అంతా అర్థమైంది. అర్థం కానిది ఎవరికి అంటే కేవలం జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులకే. వాస్తవానికి వైసీపీలో కీలక వ్యక్తులందరి టార్గెట్ పవన్ కళ్యాణ్. అవును పవన్ కళ్యాణ్. ఏపీలో వైసీపీ చేసే రాజకీయం ఎన్నటికీ చంద్రబాబు అర్థం చేసుకోలేరు. ఒకవేళ అర్థం చేసుకున్నా చంద్రబాబు ఆ దారిలో నడవలేరు. కానీ వైసీపీ చేసిన ప్రతి పనీ పవన్ కళ్యాణ్ చేయగలడు. వైసీపీ చేసే ప్రతి విమర్శ పవన్ చేయగలడు. వైసీపీ మాట్లాడే అన్నిరకాల మాటలు పవన్ అనగలడు. 

అందుకే వైసీపీ బతకాలంటే... ముందు పవన్ ని బలహీన పరచాలి. సామదానబేధదండోపాయాలను ఉపయోగించి పవన్ కళ్యాణ్ ని అదుపులో పెట్టాలి. పవన్ నోరు నొక్కాలి. జనాల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పవన్ ని వివాదంలో ఇరికించాలి. దీనికోసం జగన్ స్థాయి నుంచే ప్రయత్నం జరుగుతోంది. అందుకే పవన్ చేసే మంచి డిమాండ్ల ఉద్దేశాన్ని వదిలేసి అతని వ్యాఖ్యలను విరిచి కొన్ని పదాలపై కామెంట్లు చేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రే ఈ పనికి ఒడిగట్టారు. ఇక విజయసాయిరెడ్డి అయితే... పవన్ ప్రశ్నలను, డిమాండ్లను అసలు ప్రస్తావించారు. ఎంత సేపు చంద్రబాబు మనిషి అని జనాల్ని నమ్మించే ప్రయత్నం తప్ప ఇంకోటి చేయరు. దానిని ఒక డ్యూటీలాగ చేస్తుంటారు. వైసీపీ సోషల్ మీడియాకు కూడా పవన్ ని టార్గెట్ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు వారు ముందుకు వెళ్తున్నారు. 

పవన్ కళ్యాణ్ టెక్నికల్ గా ఎంత కరెక్టు అన్నది పక్కన పెడితే.. ఎమోషన్ పార్ట్ లో అతను అందరికీ నచ్చే అవకాశం ఉంది. వైసీపీ లాగా తెగించి పోరాడే అభిమానులు టీడీపీకి తక్కువ. కానీ జనసేనలో ఆ బ్యాచ్ ఎక్కువ. పవన్ చెప్పిన దాని గుడ్డిగా అమలు చేయడంలో జనసేన క్యాడర్ ఏమాత్రం వెనుకాడదు. అనాలోచిత దాడి అయినా, ఆలోచనతో కూడిన దాడి అయినా, గెరిల్లా పోరాటం అయినా... ఏదైనా పవన్ సేనకు తెగింపు కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే.. టీడీపీకి అనచరులు, సానుభూతి పరులు ఉంటారు. కానీ... వైసీపీకి, జనసేనకు ఆత్మాహుతి దళాలంతటి స్ట్రాంగ్ ఫాలోయర్లు ఉంటారు. తదనంతర కాలంలో వచ్చే ఎలాంటి విపరిణామాల గురించి ఆలోచించంకుండా పనిచేయగల తెగింపు ఉన్న జనసేన ఎదిగితే వైసీపీకి చాలా నష్టం. అందుకే దానిని మొగ్గలోనే తుంచేయాలని తీవ్ర కాంక్షతో వైసీపీ ముందుకు సాగుతోంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే... పవన్ భవిష్యత్తును జనసేన కంటే జగనే బాగా అంచనా వేశాడు. అందుకే ఇంత జాగ్రత్త పడుతున్నాడు.