జగన్ కు పవన్ లేఖ ... వెరైటీ డిమాండ్

July 07, 2020

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. 100 రోజుల పాటు పాలనపై స్పందించకూడదని కచ్చితంగా నియంత్రణ పెట్టుకున్నా ... తప్పనిసరి పరిస్థితుల్లో లేఖ రాసినట్టు పవన్ వినయంగా జగన్ కు లేఖ రాసిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలో ఇసుక సమస్య విపరీతంగా ఉన్న నేపథ్యంలో జగన్ వచ్చాక మేము రోడ్డున పడ్డామని భారీ ఎత్తున జనసేనకు లేఖలు రాయడంతో వాటిని పట్టించుకోమని పవన్ కళ్యాణ్ జగన్ కు లేఖ రాశారు. అయితే, పరిష్కారం కూడా పవన్ చెబుతూ సలహా ఇచ్చారు. ప్రభుత్వం ఒక పెద్ద తప్పుకు పాల్పడినా లేఖలో ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ, డిమాండ్ చేయడం కానీ కనిపించలేదు... కేవలం ఆనవాయితీగా ఇంత త్వరగా డిమాండ్లు చేయకూడదు కాబట్టి అలా అడిగామని జనసేన చెప్పుకున్నా... జగన్ పట్ల ఉన్న కొంచెం భయం వల్ల కూడా అలా చేశారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశ్నించడానికి జనసేన పుట్టిందని చెప్పే పవన్ తానే ప్రశ్నించడానికి భయపడితే ఇంక ఆ పార్టీ సిద్ధాంతానికి అర్థమేంటో ఆయన చెప్పాలి.

ఇంతకీ పవన్ లేఖ రాసిన సమస్య ఏంటంటే... భవన నిర్మాణ కార్మికులు ఇసుక పాలసీ లేక ఉపాధి కోల్పోయారట. మీరు సెప్టెంబరు 5 పాలసీ ప్రకటిస్తామన్నారు కానీ... కూలీ మీద ఆధారపడే వారు అంతవరకు తట్టుకోలేరు కాబట్టి వారికి ఏదైనా భృతి ఇవ్వండి ప్రభుత్వం తరఫున అని పవన్ అడిగారు.

అంతేగానీ... అత్యవసరంగా ఇసుక పాలసీ ప్రకటించి ఈ సమస్యను పరిష్కరించమని పవన్ నిలదీయలేదు. ప్రభుత్వం అనాలోచిత విధానం వల్ల జనం నష్టపోతుంటే నిలదీయడంలో తప్పేముంది. ఇక్కడ ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అవి బాగున్నాయో లేదో విమర్శించడానికి టైం తీసుకుంటే ఓకే గాని... ఉద్దేశ పూర్వకంగా జనాన్ని రోడ్డున పడేసిన ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పేంలేదు అని పవన్ గ్రహించలేదు.

  అయినా భృతి అడగడం విచిత్రంగా ఉంది... ఈ నెల రోజుల పాటు నిర్మాణ కార్మికులు వీళ్లే అని ఎలా గుర్తిస్తారు? ఎలా భృతి ఇస్తారు.