ఏంది పవన్ ఈ ట్విస్టులు ? - రాంమాధవ్ తో భేటీ!

May 25, 2020

సాధారణంగా పవన్ శుభకార్యాలు, చావులు తప్ప చాలా ఆహ్వానాలకు పిలిచినా వెళ్లేవారు కాదు. తన లోకంలో తాను ఉండేవాడు. కానీ రాజకీయాలు ఎవరిని అయినా మారుస్తాయి. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలను కలిసే అవకాశాన్ని పవర్ స్టార్ వదులుకోదలచుకోవడం లేదు ఇపుడు.
తొలిసారి తానా సభలకు హాజరైన జనసేనాధిపతి తానా వేదికపై రాజకీయ వ్యాఖ్యలు చేసి వైరల్ అయ్యారు. జైల్లో ఉండొచ్చిన వారు ఓట్లు కొని హ్యాపీగా ఉండగా లేనిది, సత్యం మాట్లాడే తానెందుకు హ్యాపీగా ఉండను అని వ్యాఖ్యానించారు. ఇవి ఎవరికో గుచ్చుకున్నాయి. అది వేరే విషయం. నిన్న ఈ వ్యాఖ్యలతో వార్తలకెక్కిన పవన్ తాజాగా మళ్లీ వార్తల్లోవ్యక్తి అయ్యారు.
పవన్ తో పాటు తానాకు హాజరైన ప్రముఖుల్లో బీజేపీ వ్యూహకర్త రాంమాధవ్ కూడా ఉన్నారు. ఆయన ఆహ్వానితుల్లో ఒకరుగా ఉండటం ఒక వార్తయితే, అక్కడికి వెళ్లడమూ వ్యూహాత్మకమే అంటున్నారు. అంతకుమించిన విశేషం ఏంటంటే... తమ పాత మద్దతు దారు అయిన పవన్ కల్యాణ్ తో ఆయన మీటింగ్ పెట్టారు. వీరిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు.
అంతసేపు చర్చించారంటే... ఏదో పెద్ద విషయమే ఉందని అందరూ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కానీ పార్టీ వాళ్లు మాత్రం ఇది యాదృచ్చిక సమావేశం... రాష్ట్ర సమస్యలు, విభజన సమస్యలు, ఏపీ ప్రయోజనాల గురించే చర్చ జరిగిందని చెబుతున్నారు. ఇంకా ఏపీకి ఏమేం రావాలో జనసేనాని చెప్పారట, రాంమాధవ్ విన్నారట.