ప‌వ‌న్‌తో ప‌ట్టుబ‌ట్టి సాధించాడుగా..

May 26, 2020

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్లో ఒక‌ప్పుడు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం ఖుషి. అప్ప‌ట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. ఈ సినిమా విజ‌యంలో నిర్మాత ఎ.ఎం.ర‌త్నంది కూడా కీల‌క పాత్రే. ప‌వ‌న్ మీద ఎంతో న‌మ్మ‌కంతో చాలా రిచ్‌గా, రాజీ ప‌డ‌కుండా ఈ సినిమాను నిర్మించి అద్భుత‌మైన ఫ‌లితాన్నందుకున్నాడు ర‌త్నం. త‌న‌కిలాంటి సినిమా సెట్ చేసిన ర‌త్నం మీద ప‌వ‌న్‌కు ప్ర‌త్యేక అభిమానం ఉంది. ఆ త‌ర్వాత వీళ్ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన బంగారం దారుణ‌మైన దెబ్బ కొట్ట‌గా.. మ‌ళ్లీ వీళ్ల కాంబినేష‌న్లో సినిమా కోసం స‌న్నాహాలు జ‌రిగి అనూహ్యంగా వాటికి బ్రేక్ ప‌డింది. ప‌వ‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో స‌త్యాగ్ర‌హి అనే సినిమాను ర‌త్నం మొద‌లుపెట్టినా అనివార్య కార‌ణాల‌తో ఆపేయాల్సి వ‌చ్చింది.
ఆ త‌ర్వాత చాలా ఏళ్ల‌కు త‌మిళ హిట్ మూవీ వేదాళంను ప‌వ‌న్ హీరోగా రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేశాడు ర‌త్నం. త‌మిళ ద‌ర్శ‌కుడు నీస‌న్ ఈ సినిమా మీద కొన్ని నెల‌లు ప‌ని చేశాడు. ఈ చిత్రానికి ప్రారంభోత్స‌వం కూడా జ‌రిగింది. కానీ అనుకోని కార‌ణాల‌తో అదీ ఆగిపోయింది. అయినా కూడా ప‌వ‌న్ మీద ర‌త్నం ఆశ‌లు కోల్పోలేదు. అత‌డితో ట‌చ్‌లోనే ఉన్నాడు. మ‌ధ్య‌లో ప‌వ‌న్ సినిమాల‌కు దూర‌మైనా ర‌త్నం ఆశ‌తోనే ఉన్నాడు. చివ‌రికి ఇప్పుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ చేయ‌బోయే సినిమాను త‌నే ద‌క్కించుకున్నాడు ర‌త్నం. మైత్రీ మూవీ మేక‌ర్స్ వాళ్ల‌కు కూడా ఓ క‌మిట్మెంట్ ఉన్న‌ప్ప‌టికీ.. ముందు ర‌త్నంకే సినిమా చేయాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నాడు. ఈ నెల 27న ఈ చిత్రం ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనున్న‌ట్లు స‌మాచారం.