పవన్‌తో రెండు గంటల ‘మైత్రి’లో ఏమైంది?

February 25, 2020

‘శ్రీమంతుడు’తో అరంగేట్రం చేసి ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు అందుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. చరణ్‌తో ‘రంగస్థలం’ మొదలు పెట్టడానికి ముందే ఈ సంస్థ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ ఇచ్చింది. ‘అజ్ఞాతవాసి’ కంటే ముందే ఆ సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ కుదరలేదు. అదయ్యాక సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నప్పటికీ.. పవన్ సినిమాలకు అందుబాటులో లేకుండా పోయాడు. రాజకీయాలపై దృష్టిపెట్టాడు. అయినా సరే.. తమ అడ్వాన్స్ వెనక్కివ్వాలని ఆ సంస్థ డిమాండ్ చేయలేదు. పవన్ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తే అప్పుడు సినిమా చేసుకుందామని ఆగారు.

ఎన్నికల్లో పరాభవం తర్వాత కొన్ని నెలల పాటు రాజకీయాలపైనే దృష్టిపెట్టిన పవన్.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముందుగా క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తాడంటున్నారు. ఈ సినిమాను పవన్ ఎవరికి చేస్తాడన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఐతే పవన్ రీఎంట్రీ ఖరారవడంతో కాస్త ముందో వెనకో తమకు సినిమా చేసి పెడతాడని మైత్రీ సంస్థ ఆశాభావంతో ఉంది. తాజాగా ఆ సంస్థ అధినేతలు పవన్‌ను కలిశారు. బుధవారం ఈ మీటింగ్ జరిగిందని.. దాదాపు రెండు గంటల పాటు పవన్ వారితో మాట్లాడాడని సమాచారం. సబ్జెక్ట్, డైరెక్టర్‌ చూసుకుంటే వీలు చూసుకుని సినిమా చేసి పెడతానని పవన్ హామీ ఇచ్చాడట. క్రిష్‌ సినిమాను అనుకున్నట్లుగానే మొదలుపెడితే.. వచ్చే ఏడాది మైత్రీ వాళ్లతో పవన్ సినిమా పక్కాగా పట్టాలెక్కే అవకాశముంది.