జ‌గ‌న్‌తో డైరెక్ట్ ఫైటింగ్‌కు ప‌వ‌న్ రెడీ..!

February 23, 2020

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో నేరుగా త‌ల‌ప‌డేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రంగం సిద్దం చేసుకుంటున్నాడా..?  అందుకు ఏపీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను బేస్‌గా చేసుకుని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించేందుకు పోరు బాట ప‌ట్ట‌నున్నారా..?  జ‌గ‌న్ పాల‌నపై నేరుగానే ఉద్య‌మించాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉద్యుక్తుల‌వుతున్నారా..?  అంటే అవున‌నే స‌మాధానం జ‌న‌సేన వ‌ర్గాల నుంచి వ‌స్తోంది.
జ‌గ‌న్‌పై పోరుబాట‌కు సిద్దంగా ఉండాల‌ని కార్య‌క‌ర్త‌ల‌ను స‌మాయ‌త్తం చేస్తున్నారు. జ‌గ‌న్‌పై నేరుగా పోరుబాట ప‌ట్టేందుకు న‌వంబ‌ర్ నెల‌లో రంగంలోకి దిగ‌నున్నార‌ని పార్టీ నేత‌లు ప్ర‌కటించారు. కాకుంటే ఉద్య‌మం చేస్తున్న తేదీపై క్లారిటీ మాత్రం ఇవ్వ‌లేదు. ఏపీలో ఇసుక కొర‌త ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారును వేధిస్తున్న స‌మస్య‌. ఇసుక కొర‌త‌తో భ‌వ‌న నిర్మాణాలు ఆగిపోయాయి. అయితే ఇసుక కొర‌త రావ‌డానికి కార‌ణం ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న వైఖ‌రే కార‌ణ‌మ‌ని జ‌న‌సేన పార్టీ ముందు నుంచి ఆరోప‌ణ‌లు చేస్తోంది.
ముందునుంచి భవన నిర్మాణ కార్మికులకు మద్దతు తెలుపుతోంది జనసేన పార్టీ. ఇప్పుడు భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు మద్దతుగా ఆందోళనకు సిద్ధమవుతోంది. అందుకు హైదరాబాద్‌లో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో నవంబర్ 3వ తేదీన లేదా 4వ తేదీన విశాఖలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టనున్నట్టు జ‌న‌సేన నాయ‌కులు  వెల్లడించారు. విశాఖ‌లో నిర్వహించే ఈ ర్యాలీ ఏర్పాట్లకు పార్టీ నేత‌ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో ఓ సబ్‌ కమిటీని వేశారు.
ఈ స‌మావేశం అనంత‌రం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడారు.  ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు తాము అండగా నిలుస్తామని వెల్లడించారు. అంటే ఇక ముందు ప్ర‌భుత్వం తీసుకునే విధాన నిర్ణ‌యాల్లో జ‌రిగే లోపాల‌ను ఎత్తి చూపేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేరుగానే ఉద్య‌మించనున్నార‌ని సంకేతాలు పంపిన‌ట్లైంది.