పవన్ వేసుకున్న బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్  !

August 08, 2020

లోక్ సత్తా పార్టీ రాజకీయంగా సమాధి అవడం ద్వారా నేర్చుకోవాల్సిన గుణపాఠాలు పవన్ కళ్యాణ్ నేర్చుకున్నట్టు లేదు. ఒక్కసారి కూడా అధికార పీఠం ఎక్కకుండానే దేశంలోని ప్రముఖ జాతీయ, స్థానిక ప్రాంతీయ పార్టీలన్నిటితో పొత్తులు పెట్టుకున్న ఏకైక జనసేన పార్టీ. తెలుగు సినీ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న పవన్ ఏవేవో ఆశలతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 

కానీ ఆయన అడుగులు ఆరేడేళ్లయినా ఇంకా తడబడుతూనే ఉన్నాయి. రాజకీయంలోని అసలు మర్మాన్ని అర్థం చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ దారుణంగా విఫలం అవుతున్నారు. లోక్ సత్తా పార్టీ మునగడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడటానికి మధ్య ఉన్న చిన్న తేడాను పవన్ ఆకళింపు చేసుకోలేదు. ఈ క్రమంలో అనేక తప్పులు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా భారీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.

‘‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో

ఆరంభించడం అభినందనీయం. గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం‘‘ అంటూ జగన్ పై ప్రశంసలు కురిపించారు.

పవన్ కళ్యాణ్ ఉద్దేశం మంచిని మంచి అని చెప్పాలి, చెడును చెడు అని చెప్పాలి అన్నదే... ఇంతగొప్ప వ్యక్తిత్వం ఎవరికుంటుంది అని ఆ పార్టీ కార్యకర్తలు సంబరపడొచ్చు. కానీ ఈ లక్షణం ఆ పార్టీకి సమాధి కడుతుంది. ప్రత్యర్థిని అవకాశం దొరికినపుడల్లా చిత్తు చేసుకుంటూ పోతేనే పార్టీ నిలబడగలదు. అలా కాకుండా నేను పొగుడుతా. మంచిని గుర్తిస్తా అంటే అడుగులు వెనక్కే పడతాయి. ఎందుకంటే నీలో ఉన్న మంచిని ఏనాడు ప్రత్యర్థి గుర్తించడు. నువ్వు మాత్రం అతని మంచి ప్రమోట్ చేసుకుంటూ పోతావు. ఈ క్రమంలో నీ బలం కూడా ప్రత్యర్థి బలంగా మారుతుంది అన్నది అక్షర సత్యం. దీనివల్ల కేడర్ తీవ్ర అయోమయానికి గురవుతుంది. డీలా పడుతుంది. ఈ విధానాల వల్లే లోక్ సత్తాకు కేడర్ నిలబడలేకపోయింది.

రాజకీయాల్లో వర్గాలు, పోరాటాలు, ప్రత్యర్థిని నిలువరించడం వంటివి అత్యవసరం. కేజ్రీవాల్ అడుగడుగునా బీజేపీని తప్పు పడుతూ వ్యూహాత్మక అడుగులు వేసుకుంటూ పోవడం వల్లే పైకొచ్చారు. అంటే బీజేపీ చేసిన మంచి కేజ్రీవాల్ కి తెలియదనా దానర్థం, లేక బీజేపీ మంచే చేయలేదనా? కాదు కదా.

కేసీఆర్ కూడా అంతే... తనతో ఉంటో చంద్రబాబును, జగన్ ఎలా పొగుడుతాడు? తనతో లేకపోతే ఎలా తెగుడుతాడు. మరి తనతో ఉన్నపుడు గుర్తించిన మంచి తనతో లేనపుడు గుర్తుకురాదా అంటే... రాకూడదు అన్నదే సమాధానం అలా చేస్తే రాజకీయ సమాధే.

ఇక కొసమెరుపు ఏంటంటే... పవన్ పొగిడిన అంబులెన్సుల కాంట్రాక్టుపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. అసలు గవర్నమెంటు స్థాయిలో ఒక చిన్న టెండరు అది. రోడ్లు మీద 1000 అంబులెన్సులు నిలబెట్టి చేసిన పబ్లిసిటీ స్టంట్ వల్ల భారీ కార్యక్రమంగా ఆనింది. వాస్తవానికి ఇక్కడ ప్రశ్నించే పవన్ అడగాల్సింది... ఏడాది పాటు వీటిని ఎందుకు మూలకు పెట్టారని... కానీ ఆ విషయమే మరిచిపోయిన పవన్ జగన్ వేసిన పబ్లిసిటీ ఎత్తుగడలో చిత్తుచిత్తు అయిపోయాడు.