మోడీకి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన పవన్

August 12, 2020

మూడు దశాబ్దాల కాలం నాటి విద్యా విధానానికి స్వస్తి చెబుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిదా అయిపోయారు. భారతీయ విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తూ భావితరాలు కూడా గుర్తుంచుకునేలా కొత్తవిద్యా విధానాన్ని తీర్చిదిద్దిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయన బృందం కృషిని భావితరాలు కూడా గుర్తుంచుకుంటాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానంచారు. సుదీర్ఘకాలం తర్వాత ఉత్తమ సంస్కరణలు వచ్చాయన్నారు. 

"రాబోయే తరాల వారు రుణపడేలా సంస్కరణలు తెచ్చారు. ఇదొక విప్లవాత్మకమైన నిర్ణయం. విద్యార్థులలో  ఒత్తిడి, ఆందోళనకు కారణం అవుతున్న అర్థంలేని పాతకాలపు విద్యావిధానాన్ని సంస్కరించి మంచి పనిచేశారు. వృత్తి విద్యాశిక్షణ విధానం తీవ్ర నిర్లక్ష్యానికి గురై దేశం ఎంతో యువశక్తిని కోల్పోయింది. 

అయితే సైన్స్, కాకుంటే ఆర్ట్స్ కోర్సులు అన్నట్టుగా సాగుతున్న  మూస ధోరణికి చరమ గీతం పాడారు. విద్యార్థులకు మరో ఆప్షన్ ఇవ్వలేని ఈ నిర్బంధ విద్యకు స్వస్తి పలకడం శుభపరిణామం. 34 ఏళ్ల తర్వాత 21వ శతాబ్దపు పిల్లలను తీర్చిదిద్దేలా సమగ్రంగా, సంపూర్ణంగా, బలమైన విద్యావిధానం తెచ్చారు. అందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఈ చారిత్రక సంస్కరణలు రూపొందంచిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను‘‘ అని పవన్ ప్రత్యేక కృతజ్జతా సందేశం విడుదల చేశారు.

ఇంకా ఆయన మరిన్ని కామెంట్లు చేశారు. కొత్త విద్యావిధానం భారత్ ను సరికొత్త మార్గంలో నడిపి సరికొత్త సమాజాన్ని నిర్మించనుంది. ఈ కొత్త పాలసీ  ఓ చిన్నారిని మనదైన సంస్కృతి, విలువలే పునాదిగా పెరగడానికి దోహదపడుతుందన్నారు. ఈ విద్యా విధానం యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ మహోన్నత ఉద్దేశాలతో రూపొందించిన సంస్కరణ క్రతువులో రాష్ట్రాలు కూడా భాగస్వాములు కావాలని, భారత్ ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.