జేడీకి రిప్లై ఇస్తూ బాబు, జగన్ లకు పవన్ పంచ్

February 22, 2020

ఈ సాయంత్రం జ‌న‌సేన పార్టీకి రాజీనామా చేసి జేడీ లక్ష్మినారాయణ కలకలం సృష్టించారు. గౌరవంగా పార్టీ నుంచి తప్పుకున్న జేడీ లక్ష్మినారాయణ... ఏమీ తిట్టకుండానే, విమర్శించకుండానే పవన్ ఇమేజ్ ను సున్నితమైన పదంతోనే భారీ డామేజ్ జరిగేలా జేడీ వ్యాఖ్యానించారు. దీనికి కొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు. 

జేడీ ఏమన్నారు?

ఇంత‌కుముందు రాజ‌కీయాలే ప‌ర‌మావ‌ధి అని, సినిమాల జోలికి వెళ్ల‌న‌ని చెప్పి.. ఇప్పుడు మాట మార్చి మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాలు చేయ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ.. ఆయ‌న విధానాల్లో నిల‌క‌డ లేద‌ని విమ‌ర్శిస్తూ పార్టీకి టాటా చెప్పారు ల‌క్ష్మీనారాయ‌ణ‌. 

పవన్ ఏమన్నారు?

‘‘శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ గారి భావాల‌ను గౌర‌విస్తున్నాము. ఆయ‌న రాజీనామాను ఆమోదిస్తున్నాము. నాకు సిమెంట్ ఫ్యాక్ట‌రీలు, ప‌వ‌ర్ ప్రాజెక్టులు, గ‌నులు, పాల ఫ్యాక్ట‌రీలు లాంటివేమీ లేవు. అధిక వేత‌నం పొందే ప్ర‌భుత్వ ఉద్యోగినీ కాదు. నాకు తెలిసింద‌ల్లా సినిమా ఒక్క‌టే. నా మీద ఆధార‌ప‌డి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. ఇవ‌న్నీ ల‌క్ష్మీనారాయ‌ణ గారు తెలుసుకుని త‌న రాజీనామాలో ప్ర‌స్తావించి ఉంటే బాగుండేది. ల‌క్ష్మీనారాయ‌ణ గారు పార్టీకి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌తంగా నాకు, జ‌న‌సైనికుల‌కు ఆయ‌న‌పై ఉన్న గౌర‌వం ఎప్ప‌టికీ అలాగే ఉంటుంది. ఆయ‌న‌కు శుభాభినంద‌న‌లు’’ అని జ‌న‌సేనాని ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నాడు. 

అయితే... జేడీ మాటల్లో పవన్ కు నిలకడ లేదు అనే మాట ప్రతిపక్షాలకు అస్త్రం అవుతుందని పసిగట్టిన పవన్... దానికి చాలా షార్ప్ గా రిప్లై ఇచ్చారు. సిమెంట్, పవర్ ఫ్యాక్టరీలు గనులు అంటూ జగన్ ను టార్గెట్ చేసి, పాల ఫ్యాక్టరీలు అంటూ చంద్రబాబును టార్గెట్ చేసి జేడీకి రిప్లై ఇచ్చాడు. నాకు అవన్నీ లేవు కాబట్టి న్యాయంగా ధర్మంగా నాకు తెలిసిన వృత్తితో కుటుంబాన్ని, పార్టీని పోషించుకోక తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలు చేస్తున్నాను అని పవన్ వ్యాఖ్యానించారు.

అయినా ఇపుడున్న రాజకీయ నాయకుల్లో కనిపించడానికి ఫుల్ టైం రాజకీయాల్లో ఉంటారు గాని... వారు ప్రతిక్షణం కుటుంబ ఆస్తులను పెంచుకోవడానికి రాజకీయాలనే వ్యాపారంగా మారుస్తున్నారు. వారు తమ వ్యాపారాల గురించి ఆలోచిస్తూ పనిచేసినపుడు అది వార్తగా మారి పేపరుకు ఎక్కదు. కాబట్టి వారు ఫుల్ టైం రాజకీయనాయకులు అనిపిస్తారు. సినిమా అలా కాదు. షూటింగ్ జరిగితే జనాలకు ఆసక్తి. అందుకే పవన్ సినిమా చేస్తే మీడియాలో వస్తుంది. రాజకీయాలు పార్ట్ టైం అన్నట్టే ఉంటుంది. నిజానికి ప్రతి రాజకీయ నాయకుడికి రాజకీయం పార్ట్ టైమే. మొత్తం జేడీ చేసిన పనికి బాబు, జగన్ లు పవన్ విమర్శలు పడ్డారు.