రాపాక‌కు ప‌వ‌న్ చుర‌క‌లు

February 25, 2020

జ‌న‌సేన నుంచి గ‌త ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన ఏకైక నేత రాపాక వ‌ర‌ప్ర‌సాద్. 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం 338 ఓట్లు సాధించిన నాయ‌కుడీయ‌న‌. ఈసారి జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసి రాజోలు లాంటి పెద్ద నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం సాధించాడు. ఐతే త‌న విజ‌యం పార్టీ ఘ‌న‌తే అని తెలిసినా.. ఆయ‌న విధేయ‌త చూపించ‌లేక‌పోయాడు. కొన్ని నెల‌లు తిర‌క్కుండానే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ఆయ‌న దృష్టి మ‌ళ్లింది. ఇప్పుడు వైకాపా అన‌ధికార ఎమ్మెల్యేలా మారిపోయారాయ‌న‌. ఐతే రాపాక పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నప్ప‌టికీ జ‌న‌సేన అధినేత సంయ‌మ‌నం పాటిస్తున్నాడు. ఆయ‌న్ని ప‌ల్లెత్తు మాట అన‌ట్లేదు ప‌వ‌న్. ఐతే తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నేతలతో పవన్‌ సమావేశం సందర్భంగా రాపాక వరప్రసాద్ అంశం తెరపైకి రాగా.. ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించాడు.
జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీలో ఉన్నారో తెలియదని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించాడు. అయినా తాను కాపలా కాస్తూ కూర్చునే రాజకీయాలు చేయలేనన్నాడు. ప్రజా ప్రయోజనాలు, సమాజహితం కోసం తాను రాజకీయాల్లోకి వచ్చాన‌ని.. భావజాలం ఉన్న వ్యక్తులైతే పార్టీ కోసం నిలబడతారని.. అలా లేనివారు వెళ్లిపోతారని అన్నాడు. అయితే భవిష్యత్తులో మాత్రం మనల్ని ఇష్టపడే వ్యక్తులే ఎమ్మెల్యేలు అవుతారని ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అధికారం కోసం తాను అర్రులు చాచనని.. అడ్డదారులు తొక్కనని.. ఎవరి మోచేతి నీళ్లు తాగనని.. ఏ ఆశయంతోనైతే పార్టీ పెట్టానో ఆ ఆశయం సాధించి తీరుతానని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశాడు. కష్టాలు, నష్టాలను భరిస్తాను కానీ విలువలు, జనసైనికుల నమ్మకాల్ని మాత్రం పోగొట్టుకోనని హామీ ఇచ్చాడు జ‌న‌సేనాని.