పవన్ స్పీడు... ఓ రేంజిలో ఉంది

May 30, 2020

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లోకి పున‌రాగ‌మ‌నం చేయాల‌ని అభిమానులు ఎంత‌గానో కోరుకున్నారు. కానీ ఒక ద‌శ‌లో త‌న‌కు సినిమాల్లోకి తిరిగొచ్చే ఉద్దేశ‌మే లేన‌ట్లుగా మాట్లాడాడు ప‌వ‌న్. ఐతే త‌ర్వాత ఆయ‌న మ‌న‌సు మారింది. కుటుంబం కోసం, పార్టీ కోసం డ‌బ్బులు కావాలి కాబ‌ట్టి సినిమాలు చేయాల్సిందే అని నిర్ణ‌యించుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా వ‌రుస‌గా సినిమాలు ఒప్పేసుకున్నాడు. ఆల్రెడీ ఒక‌టికి రెండు సినిమాలు ప‌ట్టాలెక్కేశాయి. అందులో ఒక‌టి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న పింక్ రీమేక్ కాగా.. మ‌రొక‌టి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ నిర్మాత ఎ.ఎం.ర‌త్నం ప్రొడ్యూస్ చేస్తున్న‌ది. పింక్ రీమేక్ షూటింగ్ కూడా జ‌రుపుకుంటుండ‌గా.. క్రిష్ మూవీ ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది.
ఇవి కాక ప‌వ‌న్ రెండు సినిమాలు ప‌ట్టాలెక్కించ‌బోతుండ‌టం విశేషం. అందులో ఒక‌దాని గురించి శ‌నివార‌మే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ప‌వ‌న్‌కు కొన్నేళ్ల కింద‌టే అడ్వాన్స్ ఇచ్చి ఆయ‌న ఎప్పుడు అందుబాటులోకి వస్తాడా అని చూస్తున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ ఎట్ట‌కేల‌కు ఆయ‌న‌తో సినిమాను అనౌన్స్ చేసింది. గ‌బ్బ‌ర్ సింగ్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌టం విశేషం. ఇదిలా ఉండ‌గా.. ప‌వ‌న్ ఓ యువ ద‌ర్శ‌కుడితోనూ సినిమా క‌మిట‌య్యాడ‌న్న‌ది తాజా స‌మాచారం. జెర్సీ సినిమాతో అంద‌రినీ మెస్మ‌రైజ్ చేసిన గౌత‌మ్ తిన్న‌నూరి ప‌వ‌న్ 29వ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ట‌. మెగా నిర్మాత అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ మూవీ గురించి కూడా అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని స‌మాచారం.