జగన్ అడ్డాలో పవన్... స్పీచ్ దంచేశాడు

May 31, 2020

ఏపీలో రాజకీయాలు అంతకంతకూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అధికార వైసీపీతో విపక్ష పార్టీలన్నీ కూడా తమదైన శైలిలో పోరాటం సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా జనసేన కూడా వైసీపీపై ఓ రేంజిలో విరుచుకుపడుతోంది. జనసేన అధినేత తన రాయలసీమ పర్యటనలో భాగంగా తొలి లక్ష్యం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లానే కావడం ఆసక్తి రేకెత్తించేదే. రాయలసీమ పర్యటనలో భాగంగా తొలి అడుగు కడప జిల్లాలోనే మోపిన పవన్... జగన్ సొంత జిల్లా నుంచే జగన్ పై సంచలన కామెంట్లు చేశారు. మొత్తంగా నీ ఇంటికే వచ్చానన్న రీతిలో పవన్ చేసిన వ్యాఖ్యలకు జగన్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

కడప జిల్లా రైల్వే కోడూరులో ఆదివారం పర్యటించిన పవన్... జగన్ ను తూర్పారబట్టేశారు. జగన్ వైఖరిని తప్పుబడుతూ పవన్ చేసిన ప్రసంగం కూడా అక్కడి యువతతో కేరింతలు కొట్టించింది. జగన్ ను అందరూ జగన్ అనో, లేదంటే జగన్ మోహన్ రెడ్డి అనో పిలుస్తున్నారు కదా. అయితే పవన్ మాత్రం ఇటీవలి కాలంలో ప్రత్యేకించి జగన్ సీఎం అయ్యాక ఆయనను జగన్ రెడ్డి అని ప్రత్యేకంగా పిలుస్తున్నారు. జగన్ ను పవన్ ఇలా పిలుస్తున్న వైనంపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాను జగన్ ను జగన్ రెడ్డి అనే పిలుస్తానని, ఈ తరహా పిలుపును తాను ఆపాలంటే... అది జగన్ చేతుల్లోనే ఉందని పవన్ ట్విస్ట్ ఇచ్చారు. ఇతరుల గురించి జగన్ గౌరవంగా మాట్లాడటం, తన హోదాకు తగినట్లుగా మాట్లాడటం నేర్చుకున్న మరుక్షణమే తాను జగన్ రెడ్డి అనే పదాన్ని వదులుతానని, అప్పటిదాకా జగన్ ను జగన్ రెడ్డి అనే పిలుస్తానని, ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని కూడా పవన్ తేల్చేశారు. 

ఇక ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్ కు... రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ప్రధాని వద్ద ప్రస్తావించే ధైర్య లేదని కూడా పవన్ సంచలన వ్యాఖ్యలే చేశారు. రాయలసీమకు ఉక్కు ఫ్యాక్టరీ రావాల్సిన అవసరం ఉందని, అయితే మోదీ వద్దకు వెళ్లిన జగన్... సీమకు అణుశుద్ధి కర్మాగారం అడిగారని పవన్ చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీని వదిలేసి అణు ఫ్యాక్టరీ అడుగుతున్నారంటే... జగన్ కు అందులో ఏమైనా వాటా ఉందా? అని కూడా పవన్ ప్రశ్నించారు. తన కంపెనీ భారతీ సిమెంట్స్ పై ఉన్న శ్రద్ధ జగన్ కు ఇతర కంపెనీలపై లేదని కూడా పవన్ ఆరోపించారు. సీమలో ఇతర పార్టీ నేతలను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, ఈ బెదిరింపులకు తాను బెదరబోనని, ఇతర పార్టీల నేతలు బెదరకుండా ఉండేలా తాను వారిలో ధైర్యం నూరిపోస్తానని కూడా పవన్ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా తాను రైల్వే కోడూరులో స్థలం కొనుగోలు చేస్తానని పవన్ ప్రకటించారు. మొత్తంగా జగన్ సొంత జిల్లాలో పవన్ ఓ రేంజిలో స్పీచ్ దంచేశారు.

Read Also

జాతీయ మీడియా వాయించాక కేసీఆర్ నోరు విప్పాడు
అక్కడ మంత్రుల కంటే ఆ వైసీపీ లీడర్ పవర్‌ఫుల్లట
మిగిల్చింది గోరంత.. మింగింది కొండంత