ఎన్నికల సమరంలో పవన్ వెనుకబడ్డారా..? ఈ సైలెన్స్‌కి అదే కారణమా?

July 04, 2020

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉత్కంఠ నడుమ హోరాహోరీగా నడిచిన ఎన్నికల సమరం ముగియటంతో అందరి దృష్లి ఫలితాలపై పడింది. అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలు పోటాపోటీగా ఎన్నికల బరిలో నిలిచాయి. అయితే ఎన్నికలు ముగిశాక మాత్రం టీడీపీ, వైసీపీలు గెలుపు తమదే అని బహిరంగంగా ప్రకటిస్తుండగా.. పవన్ మాత్రం సైలెంట్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో.. జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుందని అంచనాకు వచ్చిన పవన్.. ఇలా సైలెంట్ అయ్యారనే టాక్ మొదలైంది. ఇక పవన్ దుకాణం సర్దేసినట్లే అని చెప్పుకుంటున్నారు జనం.

ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉండటంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయనే విషయంలో ఎన్నో విశ్లేషణలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చూస్తే అధికార టీడీపీకి 150 సీట్లు వస్తాయని, వైసీపీకి 60 సీట్ల దాకా రావచ్చని చెబుతున్నారు. కానీ పవన్ జనసేన విషయంలో మాత్రం ఇన్ని సీట్లు రావచ్చని ఏ విశ్లేషణలు రావడం లేదు. పైగా ఎన్నికల అనంతరం టీడీపీ, వైసీపీ పార్టీలు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తుండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి మీడియా సమావేశంలో పాల్గొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఇదే ఆయన రాజకీయాల్లోకి రావడానికి కారణమైంది. మరోవైపు కాపు సామాజిక వర్గం జనసేన వెంటే వస్తారని ఆ పార్టీలోని నాయకులు ధీమాతో ఉన్నారు. దీంతో పవన్ సీపీఎం - బీఎస్పీలతో పొత్తుపెట్టుకొని రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. పవన్ భీమవరం, గాజువాక నుంచి బరిలో నిలిచారు.

అయితే ఎన్నికలకు ముందు కనిపించిన వాతావరణం తీరా ఎన్నికల సమయంలో పూర్తిగా మారిపోయింది. ప్రజానీకం అంతా టీడీపీ వైపే మొగ్గడంతో వైసీపీ, జనసేన శ్రేణుల్లో కలవరం మొదలైంది. కాగా తమ ఓటమి తప్పదని తెలిసినప్పటికీ వైసీపీ శ్రేణులు విజయం తమదే అని చెప్పుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇలా కూడా చెప్పకుండా పూర్తిగా సైలెంట్ అయ్యారు. స్వయంగా ఈయన విజయంపై కూడా సందేహాలు ఉండటంతో.. పవన్ ఇలా డల్ అయిపోయారా? అని జనాల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ మేరకు జనసేనకు 10 లోపు సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ జనసేనానిలో మాత్రం కనీసం ఈ మాత్రం కాన్ఫిడెన్స్ కూడా కనిపించడం లేదని ఆయన తాజా వ్యవహారం చూస్తుంటే అర్థమవుతోంది.