పవన్ అనుకున్నది ఇప్పుడు జరుగుతోంది

December 13, 2019

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. అందుకే రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూహాల అమలును ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ రెండు విడుతలుగా 141 మంది అభ్యర్థులను ప్రకటించింది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే, ఏకంగా మొత్తం స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మరోవైపు, జనసేన కూడా రెండు జాబితాలు విడుదల చేసింది. దీంతో ఈ అభ్యర్థులంతా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో వలసలు కూడా ఎక్కువైపోతున్నాయి. తమకు టికెట్ దక్కలేదనో.. తమ వాళ్లకు మొండిచేయి చూపారనో.. తమను అవమానించారనో.. మరేదో కారణం చూపో తమ తమ పార్టీలకు రాజీనామాలు చేసేస్తున్నారు. వెంటనే వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు.

వాస్తవానికి జనసేన ఎంట్రీ తర్వాత రాష్ట్రంలో త్రికోణ పోటీ ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో సహా అంతా భావించారు. అందుకు తగ్గట్లు ఆయన వ్యూహాలు కూడా సిద్ధం చేసుకున్నారు. కర్నాటకలో జేడీఎస్ కుమారస్వామి సీఎం అయినట్లు ఏపీలో కూడా పవన్ చక్రం తిప్పుతారని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. ఒకవైపు, తెలుగుదేశం పార్టీ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దూసుకుపోతోంది. వీటి తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చాలా వరకు తగ్గిపోయింది. దీంతో వైసీపీ కూడా తమ ఉనికిని చాటుకోవడంతో పాటు, అధికార పక్షాన్ని దెబ్బకొట్టాలనే లక్ష్యంతో టీడీపీలోని ముఖ్య నేతలకు గాలం వేసి, చాలా మందిని ఆ పార్టీలో చేర్చుకుంది.

తాజాగా జగన్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. అంతేకాదు, 25 ఎంపీ స్థానాలకు సైతం అభ్యర్థులను వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు పార్టీలో కీలకంగా పని చేసిన చాలా మంది ఆశావాహులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులను ప్రకటించడంతో పాటు, ఆ పార్టీలో ఖాళీ లేకపోవడంతో మరో ఆప్షన్ చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగా, మరికొందరు జనసేన నేతలతో మంతనాలు జరుపుతున్నారట. ఈ రెండు పార్టీల నుంచి వలసలు ఉంటాయని అప్పట్లో పవన్ అన్న మాటలు ఎన్నికల ముంగిట నిజమవుతున్నాయి. మరి వీరిలో ఎంత మంది సత్తా చాటుతారో చూడాలి.