ప‌వ‌న్ రెచ్చిపోతున్నాడు.. జ‌గ‌న్ ఏం చేస్తున్నాడు?

June 06, 2020

క‌రోనా విజృంభిస్తున్న వేళ‌.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అర్థ‌వంత‌మైన చ‌ర్య‌ల‌తో త‌న ఇమేజ్ పెంచుకుంటున్నాడు. టాలీవుడ్ సెల‌బ్రెటీలు పెద్ద‌గా స్పందించ‌ని స‌మ‌యంలో రూ.2 కోట్ల భారీ విరాళంతో ప‌వ‌న్ అంద‌రికీ స్ఫూర్తిగా నిలిచాడు. సినీ ప‌రిశ్ర‌మ నుంచి ప‌దుల కోట్ల‌లో విరాళాలు పోగ‌వ్వ‌డానికి ఒక ర‌కంగా స్ఫూర్తినిచ్చింది ప‌వ‌నే. ఆ త‌ర్వాత ట్విట్ట‌ర్ ద్వారా క‌రోనాపై జ‌నాల్లో అవ‌గాహ‌న పెంచ‌డంలో, ఆప‌న్నుల‌కు సాయం చేయ‌డంలో ప‌వ‌న్ గొప్ప ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. లాక్ డౌన్ నేప‌థ్యంలో క్షేత్ర స్థాయికి వెళ్లే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ప‌వ‌న్ ట్విట్ట‌ర్ నుంచి స‌మ‌స్య‌ల్లో ఉన్న‌వారికి అండ‌గా నిలుస్తున్నాడు. ముందుగా చెన్నై పోర్టులో చిక్కుకున్న శ్రీకాకుళం మ‌త్స్య‌కారులకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నుంచి సాయం అందేలా చేశాడు ప‌వ‌న్.
త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో చిక్కుకున్న తెలుగు వ‌ల‌స కార్మికుల్ని ఆదుకునేలా అక్క‌డి ప్ర‌భుత్వాన్ని క‌దిలించాడు. తర్వాత గుజరాత్‌లోనూ తెలుగు వారికి అండ‌గా నిలిచాడు. ఇప్పుడు యూకేలో చిక్కుకున్న భార‌తీయ విద్యార్థుల ఇబ్బందుల గురించి విదేశాంగ శాఖ దృష్టికి తెచ్చాడు. దీనిపైనా స్పంద‌న వ‌చ్చింది. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త చ‌రిష్మాకు తోడు బీజేపీతో మైత్రీ బంధం కూడా క‌లిసొచ్చి బాధితుల‌కు స‌త్వ‌ర సాయం అందుతుండ‌టంతో ప‌వ‌న్ హీరో అవుతున్నాడు. ఐతే ఓవైపు ప‌వ‌న్ ఇలా ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని గుర్తించి వారి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తుంటే.. జగ‌న్ స‌ర్కారు మాత్రం ఇదేం ప‌ట్ట‌న‌ట్లు ఉంటోంది. ప‌వ‌న్ ఒక టాస్క్ పూర్తిచేయ‌గానే ప్ర‌భుత్వం మేల్కొని ఇలా ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు వారి గురించి ఆరా తీసి.. వారికి సాయం అందించే ప్ర‌య‌త్నం చేయాల్సింది. కానీ జ‌గ‌న్ స‌ర్కారు అలాంటిదేమీ చేస్తున్న సంకేతాలు క‌నిపించ‌డం లేదు. దీంతో ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నిని ప‌వ‌న్ చేస్తున్నాడంటూ అత‌డిపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.