పీకే దెబ్బకు జగన్ దిగొచ్చారుగా

May 26, 2020

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చూసి జగన్ నిజంగానే భయపడిపోయారన్న వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో పదో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై పాఠశాల యజమాని కుమారులు గ్యాంగ్ రేప్ చేసి చంపేశారన్న ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. 2017లోనే జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు అప్పటి నుంచే న్యాయపోరాటం చేస్తున్నా... ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే బాధితురాలి తరఫున గళం విప్పిన పీకే... కర్నూలు పర్యటనకు వస్తున్నానని, ఈ ఘటనను సీబీఐకి అప్పగించే దాకా అక్కడే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో పవన్ పర్యటనకు ఓ రోజు ముందు... అంటే బుధవారం హడావిడిగా మంగళవారం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా కర్నూలు జిల్లా ఎస్పీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. 

కర్నూలు పర్యటనకు వస్తున్నానని పవన్ చెప్పేదాకా ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసు యంత్రాంగం... పవన్ కర్నూలు పర్యటనకు ఓ రోజు ముందుగా కేసును పవన్ కోరినట్టుగా సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా పోలీసుల నుంచి ప్రకటన వెలువడిందంటే... పవన్ ను చూసి జగన్ సర్కారు భయపడిందనే చెప్పాలి కదా. మంగళవారం కర్నూలులో ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ జిల్లా ఎస్పీ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా కేసు పూర్వపరాలను సమగ్రంగా వివరించిన ఎస్పీ... ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎప్పుడో నిర్ణయించామని చెప్పడం కూడా జగన్ సర్కారులోని భయాన్ని చెప్పకనే చెప్పేసిందన్న వాదన వినిపిస్తోంది.

జగన్ సర్కారు నుంచి ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా ప్రకటన వచ్చినా... పీకే మాత్రం తాను చెప్పినట్టుగానే బుధవారం ర్యాలీ  చేపట్టారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన పవన్... అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. గిరిజన బాలికపై జరిగిన హత్యాచారం ఘటనపైనే నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్న జగన్ సర్కారు... ఇక ఈ ఘటన జరిగిన చోటే జ్యూడిషియల్ కేపిటల్ ఏర్పాటు చేస్తున్నామంటూ ఆర్బాటం చేయడమెందుకని పవన్ ప్రశ్నించారు. గిరిజన బాలికకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోని ప్రదేశంలో జ్యూడిషియల్ కేపిటల్ పెట్టడం అవసరమా? అని కూడా పవన్ ప్రశ్నించారు. అంతేకాకుండా గిరిజన బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను శిక్షించలేని జగన్ సీఎంగా ఉండేందుకు అర్హుడా? అంటూ కూడా పవన్ ఓ రేంజిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా... గిరిజన బాలికపై జరిగిన హత్యాచారంపై పవన్ పర్యటన పుణ్యమా అంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు రావడం ఆహ్వానించదగ్గ విషయమేనని చెప్పాలి.