​బీజేపీ పీఆర్వో అవతారంలో పవన్ కళ్యాణ్ ​

May 26, 2020

నమ్మింది బలంగా సమర్థించాలి. అపుడే మనం నిర్దేశించుకున్న వ్యక్తిగత లక్ష్యాలు కచ్చితంగా చేరుకుంటాం. ఇది విజయసూత్రాల్లో కీలకమైనది. పవన్ కళ్యాణ్ దీన్ని భలే వంటబట్టించుకున్నట్లు అర్థమవుతోంది. అనూహ్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్... బీజేపీని పూర్తి స్థాయిలో భుజాలపై మోస్తున్నాడు. బీజేపీ లక్ష్యాలు, బీజేపీ ఆలోచనలు తన ఆలోచనలుగా బతకడానికి రెడీ అయిపోయారు. అంతేకాదు... బీజేపీ భావాలను జనంలోకి తీసుకెళ్లే ప్రచారకర్తగా ఆయన మారిపోయారు. 

తాజాగా ఏపీలో అమరావతి గొడవ నడుస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. అమరావతికి మద్దతుగా ఒక వర్గం, అమరావతికి వ్యతిరేకంగా ఒక వర్గం. అయితే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. బీజేపీ తలచుకుంటే చిటికేసి రాజధాని మార్పును ఆపేయగలదు అని ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. అంతటి అధికారం, అవకాశం ఉన్న బీజేపీ ఊరికే మార్పును వ్యతిరేకిస్తూ ఉండిపోవడంతో అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వైకాపా మీడియాకు లీకులు ఇచ్చింది. మోడీ షాలకు చెప్పిన తర్వాతే జగన్ రాజధానిని మారుస్తున్నారని... ప్రచారం చేసింది. ఏపీ ప్రజలకు రాష్ట్రం కంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. అందుకే బీజేపీ కూడా ఏపీ ప్రజల మనస్తత్వాలను అవకాశంగా తీసుకుని గేమ్స్ ఆడుతోంది. అయితే... తమ రాజకీయ వ్యూహాత్మక సైలెన్స్ ను వైకాపా దుర్వినియోగం చేయడం మొదలుపెట్టడంతో బీజేపీకి ఇపుడు సెగ తగిలింది.

అమిత్ షా, మోడీలకు రాజధాని మార్పు గురించి జగన్ ముందే చెప్పాడు అంటూ తాజాగా జాతీయ మీడియాలో వచ్చిన వార్తను బీజేపీ తరఫున ఆ పార్టీ ఏపీ వ్యవహారాల సహ ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ తీవ్రంగా ఖండించారు. ’’అమరావతి నుంచి రాజధానిని తరలించాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తాము తీసుకునే మూర్ఖపు నిర్ణయాన్ని సమర్ధించుకోలేక దానిపై కేంద్రం తో చర్చించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటు  @ncbn, ఇటు @ysjagan  అబద్ధాల ప్రచారంలో దొందూ-దొందే.‘‘​ ఇది దేవ్ ధర్ వేసిన ట్వీటు. అయితే ఈ ట్వీటు పడిన వెంటనే పవన్ దానిని రీట్వీట్ చేసి మరింత ప్రముఖంగా ప్రచారం చేశాడు. సునీల్ దేవ్ ధర్ ఫాలోయర్స్ లక్షమంది. పవన్ ఫాలోయర్స్ 38 లక్షల మంది. అందుకే పవన్ రీట్వీట్ చేయడంలో బీజేపీకి ఫుల్ పబ్లిసిటీ అన్నట్టు లెక్క.

సాధారణంగా సినిమా నటులు వేసే ట్వీట్లను వారి పీఆర్వోలు రీట్వీట్ చేస్తూ ప్రచారం కల్పిస్తుంటారు. ఇపుడు బీజేపీ తరఫున పవన్ ఆ పని చేసిపెట్టాడు. జస్ట్ రీట్వీట్ చేయడమే కాదు... బీజేపీకి చెప్పే చేస్తున్నామని వైసీపీ, టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ వ్యాఖ్యానించారు పవన్. మొత్తానికి బీజేపీ వల్ల పవన్ కు ఏం లాభమో పవన్ కి మాత్రమే తెలుసు. కానీ పవన్ వల్ల బీజేపీకి ఎంత లాభమో జనాలు అందరికీ తెలుసు.