కేసీఆర్ ని బతిమాలిన పవన్... ఎవరి కోసమంటే...

July 08, 2020

``ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల మద్దతు, వారు చేసిన పోరాటం తీసిపారేయలేనివి. ఆర్టీసీ కార్మికుల బాధలు ప్రభుత్వ పెద్దలు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాం. 48 వేల మంది కార్మికులు మాత్రమే కాదు, వారి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ని వేల కుటుంబాలు ఆకలితో బాధ పడడం ఎవరికీ మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ హయాంలో బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగిన సమయంలో రైతుల ఆవేదన ఎంతగా కలచివేసిందో, ప్రస్తుత సమస్య కుడా నన్ను అంతే కలచివేస్తోంది. ``ఇది...తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మె గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు. ఆర్టీసీ కార్మికులు స‌మ్మె కొన‌సాగుతున్న స‌మ‌యంలో... 27వ‌ రోజు ప‌వ‌న్ ఇలా రియాక్ట‌య్యారు. తాజాగా సైతం ప‌వ‌న్ అదే రీతిలో స్పందించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె సమస్య పరిష్కారం కోసం ముందుకు రావాల‌ని మ‌రోమారు తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయ‌న కోరారు.
ఆర్టీసీ జేఏసీ నేత‌లు అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసుకొని సెప్టెంబర్ 4 ముందు ఉన్న పరిస్థితులు ఆర్టీసీలో ఉంటే వెంటనే తాము సమ్మెను విరమిస్తామని ప్ర‌క‌టించారు. గత 47 రోజులుగా చేస్తున్న సమ్మెకు ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు వారే స్వ‌యంగా ప్ర‌క‌టించి..ప్ర‌భుత్వం ఎలాంటి ష‌ర‌తులు విధించ‌క‌పోతే...విధుల‌కు హాజ‌ర‌వుతామ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా రియాక్ట‌య్యారు.  ``పెద్దలు, గౌర‌వ‌నీయులైన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మా ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులూ కోరారు. నలభై రోజులకిపైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను. తద్వారా ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఆపై సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ అధ్యక్షులు, జనసేన పార్టీ`` అని ట్వీట్ చేశారు.
ప‌వ‌న్ ట్వీట్‌కు కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారా?  గ‌తంలో ఆర్టీసీ కార్మికుల‌కు హామీ ఇచ్చిన ప్ర‌కారం...చ‌ర్చించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అపాయింట్మెంట్ కోర‌గా ఇవ్వ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి ఇప్పుడు ప‌వ‌న్ మాట విని స‌మ్మెకు ముగింపు ప‌లుకుతారా? అంటే...వేచి చూడాల్సిందే.