బాలయ్య కథ పవన్ చెంతకు.. యంగ్ డైరెక్టర్‌కు లక్కీ చాన్స్

May 31, 2020

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదిగిన నటుడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారాయన. అందుకే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అయితే, ఆయన రాజకీయ పార్టీ ‘జనసేన’ను స్థాపించిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు. దీంతో పవన్ అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. అంతేకాదు, చాలా మంది దర్శక నిర్మాతలు కూడా పవన్ రీ ఎంట్రీ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇలాంటిదే మరో వార్త బయటకు వచ్చింది.
పవన్ కల్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని వైరల్ అవుతున్న సమయంలోనే మరో వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. పవన్ ఓ బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయబోతున్నాడట. అదే.. అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రలో నటించిన ‘పింక్’. బాలీవుడ్‌లో వచ్చిన సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు హక్కులను తీసుకున్న దిల్ రాజు.. దీని కోసం ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాను బాలయ్యతో చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కథ కూడా ఆయనకు వినిపించారని అన్నారు.
అయితే, బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ అనే సినిమా చేస్తున్నారు. దాని తర్వాత బోయపాటి సినిమా చేస్తారు. దీంతో ఈ సినిమా మరొకరితో చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ‘పింక్’ తెలుగు రీమేక్‌ను పవన్‌తో చేయబోతున్నారని తాజాగా వార్త ఒకటి బయటకు వచ్చింది. అంతేకాదు, ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్నాడని కూడా అంటున్నారు. వాస్తవానికి వేణు - దిల్ రాజు కాంబినేషన్‌లో బన్నీ ‘ఐకాన్’ అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ, అది ఎందుకో ఇంకా ప్రారంభం కాలేదు. ఈ కారంణంగానే ‘పింక్’ రీమేక్ చేయబోతున్నారట.