పాపం.. పవన్ అలా ఇరుక్కుపోయాడేంటి..?

July 05, 2020

సినిమాల్లో పవర్ స్టార్.. బట్ రాజకీయాల్లో మాత్రం ఆయన పవర్ పనికిరావడంలేదు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్నట్లుగా ఉంది పవన్ పరిస్థితి. జనసేన పార్టీ పెట్టి.. మొదటిసారి పోటీకి దిగుతున్న పవన్.. రెండో చోట్ల పోటీకి దిగుతున్నారు. అయితే ఇదే ఆయనకు రాజకీయ సంకటంగా మారిందనేది విశ్లేషకుల అభిప్రాయం.

రెండో చోట్ల పోటీ చేయడం విషయంలో పవన్ కల్యాణ్ ఇప్పుడు అనేక సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సి వస్తోంది. అందులో ప్రధానమైనది.. గెలిస్తే ఏ నియోజకవర్గానికి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఉంటారు? అనేది. పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లో జయకేతనం ఎగరేస్తారని ఆయన అభిమానులు జనసేన పార్టీ వాళ్లు అంటున్నారు. గెలుస్తాడు బాగానే ఉంది.. మరి గెలిస్తే ఎక్కడో ఒక చోట రాజీనామా చేయాలి కదా. అదెక్కడ? అంటే దానికి సమాధానం లేదు! ఈ విషయంలో ఏ నియోజకవర్గం పేరును చెప్పినా అది పవన్ కల్యాణ్ రాజకీయ భవితవ్యానికే ఇబ్బందికరం. అందుకే పవన్ రెండు చోట్టా గెలిస్తే ఫలానా చోటుకు రాజీనామా చేస్తారు. ఫలానా నియోజకవర్గంలో కొనసాగతారు అనే అంశానికి సమాధానం దొరికే పరిస్థితి లేదు జనసేన వర్గాల్లో.

మరోవైపు రియాలిటిక్ సిచువేషన్ పరిశీలిస్తే.. పవన్ కల్యాణ్ ఎంతసేపూ గాజువాకను టార్గెట్ చేసుకున్నట్టుగానే కనిపిస్తున్నారు. అక్కడే ఇల్లు తీసుకొని మరీ గాజువాక అభివృద్ధి విషయంలో పవన్ కల్యాణ్ రకరకాల హామీలు ఇస్తున్నారు. అలా గాజువాకకు దగ్గరయ్యే ప్రయత్నం కనిపిస్తోంది కానీ భీమవరం విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ ఈ చొరవ చూపడం లేదని తెలుస్తోంది. ఇక గాజువాకలో తను గెలిస్తే వారంలో రెండు రోజుల పాటు తను స్థానికంగా అందుబాటులో ఉండటం ఖాయమని పవన్ హామీ ఇచ్చారు. ఈ హామీతో ప్రజలను ఆకట్టుకోవడం మాటేమిటో కానీ.. ప్రత్యర్థులకు మాత్రం ఆయుధాలను ఇచ్చారు ఈ జనసేనాని. అంటే వారంలో రెండు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా? లేక నిరంతరం మీకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా? అంటూ.. పవన్ తో పాటు పోటీకి దిగిన అభ్యర్థులు ఇదే అస్త్రంగా మలుచుకున్నారు. తమకు అవకాశం ఇస్తే పవన్ లా రెండు మూడు రోజులు కాకుండా, ఎప్పుడూ స్థానికంగా అందుబాటులో ఉంటాం అంటూ వారు ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఒక వేళ పవన్ భీమవరం నుంచి గెలిచినా కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. పవన్ తీరే ఇందుకు నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు. దీంతో భీమవరం ప్రజలు ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలనే వార్తలు షురూ అయ్యాయి. ఈ రకంగా రెండు చోట్ల పోటీ అనేది పవన్ కల్యాణ్ ను ఎన్నికల ముందు మరింత ఇరకాటంలో పడేస్తోందని మాత్రం రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు. చూశారా.. పవన్ పరిస్థితి! కుడిదిలో పడిన ఎలుక కన్నా దారుణంగా ఉంది కదూ..!