పవన్ కి ఇంత పవరుందా?

July 14, 2020

పవన్ ఒక ఫెయిలూర్ పొలిటీషియనా? ఒక సక్సెస్ ఫుల్ నటుడా? అప్ కమింగ్ లీడరా?... పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలి? ఈ ప్రశ్నకు మెల్లగా సమాధానం దొరుకుతోంది. అతను కచ్చితంగా అప్ కమింగ్ లీడరే. అతనికి చంద్రబాబు, కేసీఆర్ లాగా రాజ్యాంగాలు, చట్టాలు, పరిపాలనపై టెక్నికల్ అంశాలు తెలియకపోవచ్చేమో గాని... సాధారణ మనిషికి ఉన్న స్పందనలు మాత్రం ఫర్ ఫెక్టుగా ఉన్నాయి.

ఏ సమస్యపై స్పందించాలో తెలియకపోవచ్చు గాని... మాకు సమస్య ఉంది సాయం చేయండి అంటే మాత్రం వెంటనే స్పందించే గుణముంది. చాలాకీలకమైన సమస్యలన్నిటిపై పవన్ స్పందిస్తారో లేదో తెలియదు గాని... పవన్ స్పందిస్తున్న సమస్యలు మాత్రం ఏదీ వృథాగా పోలేదు. ఫాతిమా కాలేజీ, ఉద్దానం, సేవ్ నల్లమల ఏమైనా కానీ... పవన్ నెత్తికి ఎత్తుకున్న సమస్య అయితే పనికిరానిది మాత్రం కాదు. 

ఏదైనా ఒకటి నుంచే మొదలుపెట్టాలి. జనసేన పెట్టినపుడు ఆ తర్వాత పలుసార్లు పవన్ తనది సుదీర్ఘ లక్ష్యం అని చెప్పాడు. ఈ ప్రజాస్వామ్యంలో నిరంతరంగా పోరాడేవాడు ఏనాటికి అయినా నాయకుడు అవుతాడు. ప్రజలను ఆకట్టుకోవడం వేరు, ప్రజల్లో నిలవడం వేరు. పవన్ ఒక్కో సమస్యపై స్పందిస్తున్న తీరు చూశాక అతనిలో ఎంతో కొంత నిజాయితీ జనాలకు కనిపిస్తోంది. అది ఈరోజు లేదా రేపు లేదా భవిష్యత్తులో ఏదో ఒక రోజు సరైన సందర్భంలో పవన్ కళ్యాణ్ ని నాయకుడిగా నిలబెడుతుంది. జనాలకు అతిపెద్ద ప్రతినిధిగా మారుస్తుంది. ఈ సుదీర్ఘ పయనంలో అతనికి కొందరు దూరం కావచ్చు. కానీ అతను అయితే, సమాజానికి దగ్గరవుతూ వస్తున్నాడు. 

రాజ్యాలు సుభిక్షంగా ఉండటం ఎపుడూ సాధ్యం కాదు. ఈ కాలం అలాంటిది. అలాంటిపుడు సమస్యలు ఉన్నవారి వైపు నిలబడి నిష్ప్రయోజనం అయినా కూడా మాట్లాడగలిగి పోరాడగలిగిన గొంతుకు కచ్చితంగా జనం దగ్గరవుతారు. ధైర్యం, నిజాయితీ ఉన్నవాళ్లు... ఆ రెండూ లేనివాళ్లకు కూడా నచ్చడమే జీవితం. పవన్ మీద ఎన్ని ముద్రలు పడినా, ఎన్ని అపనిందలు పడినా దీర్ఘకాలంలో అవేమీ అతనికి ఆటంకాలు కాబోవు. 

తాజాగా ఇటీవల జరిగిన ఓ ఘటన ప్రస్తావించుకుందాం. అనూహ్యంగా జనసేనకు చెందిన 400 ట్విట్టరు అక్కౌంట్లు సస్పెండ్ అయ్యాయి. ఇది పెద్ద గోలగా మారింది. ఒకపార్టీ అనుకూలురువి మాత్రమే ఇంత పెద్ద ఎత్తున సస్పెండ్ అవడం ఏంటి? అని అందరూ ఆశ్చర్యపడ్డారు. దీనివెనుక ఏదైనా కుట్ర ఉందని చర్చ జరిగింది. ఒకట్రెండు రోజులు పవన్ వేచి చూశారు. ఆ తర్వాత ట్విట్టరులో తీవ్రంగా స్పందించారు.

జనం తరఫున పోరాడినందుకు జనసైనికుల అక్కౌంట్లు సస్పెండ్ చేశారా? భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం నియంతృత్వం కాదా, చట్ట విరుద్ధం కాదా అని ట్విట్టరును ప్రశ్నించారు పవన్. ఈయనేంట్రా బాబూ ఆకాశం మీద ఉమ్మేసినట్లు ట్విటరును అడిగితే వాళ్లు పట్టించుకుంటారా అన్నారు. కట్ చేస్తే... ట్విట్టరు వాటిని పరిశీలించింది. బ్యాన్ చేసిన అక్కౌంట్లలో 95 శాతం అక్కౌంట్లను మళ్లీ పునరుద్ధరించింది. పవన్ ఒక్క ట్వీటుకు ఇంత స్పందన ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయారు.

పవన్ ట్వీటుతో ట్విట్టరు ఇండియా హడావుడిగా కదిలింది. ఈ స్పందను పవన్ గర్వంగా చెప్పుకోకుండా వినయం ప్రదర్శించారు. తాజాగా కృతజ్జతా పూర్వక ట్వీటు వేశారు.**ట్విట్టరు ఇండియాకు నా కృతజ్జతలు, కాలరాయబడిన రాజ్యాంగ ప్రాథమిక హక్కును పునరుద్ధరించడంలో మీరు స్పందించన వేగానికి ధన్యవాదాలు** అంటూ పవన్ ట్వీట్ వేశారు. మొత్తానికి పవన్ ఒక్క ట్వీటు వేస్తే మా అక్కౌంట్లు మాకు వచ్చేశాయి అని జనసేన సంబరపడుతోంది. మళ్లీమొదటికి వస్తే... పవన్ అపకమింగ్ లీడర్. రాబోవు రోజుల్లో పీపుల్స్ చాయిస్. సామాన్యుడి గొంతు. తప్పటడుగులు వేయకుండా ముందుకు సాగితే... పీఠం దక్కినా దక్కకపోయినా సామాన్య ప్రజల్లో చోటు దక్కడం అయితే గ్యారంటీ.