నెహ్రూను తిట్టి చిక్కుల్లో పడ్డ నటి

February 21, 2020

చెలరేగిపోతున్న సోషల్ మీడియా పుణ్యమా అని.. కొందరు ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త కలకలానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. గతంలో ప్రముఖులు చేసే పలు వ్యాఖ్యలు ఫిల్టర్ అయి కొన్ని మాత్రమే తెర మీదకు వచ్చేవి. కానీ.. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఫిల్టర్ అన్నది లేకుండా.. ఎవరైనా.. ఏదైనా విషయాన్ని చెప్పేసే పరిస్థితి.
దీంతో.. కొత్త ఇబ్బందులు తెర మీదకు వస్తున్నాయి. దేశ తొలిప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూపైనా.. ఆయన తల్లిదండ్రుల మీదనే కాదు భార్య మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ టీవీ నటి పాయల్ రోహత్గి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. నెహ్రూ ప్రతిష్ట దిగజార్చేలా ఆయనపైనా.. ఆయన కుటుంబం మీదా పాయల్ పెట్టిన పోస్ట్ పెను దుమారాన్ని రేపింది.
నెహ్రూ సతీమణిపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. మరో దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం మీద కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఒకరు పాయల్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని స్వీకరించిన పోలీసులు విచారిస్తున్నారు. తొందరపడి వ్యాఖ్యలు చేసి.. లేనిపోని తలనొప్పలు తెచ్చుకోవటం అంటే ఇదేనన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది.